సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్లందరికీ రానున్న నాలుగు రోజుల్లో కొవిడ్ టీకాలు వేయించాలని ఆ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, డీఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో ఆయన దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
టీకాల అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని సూచించారు. జిల్లా, మండల పరిషత్ ఛైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులతో పాటు పంచాయతీరాజ్, ఉపాధి హామీ, సెర్ప్ ఉద్యోగులందరికీ రానున్న నాలుగు రోజుల్లో కొవిడ్ టీకా వేయించాలని స్పష్టం చేశారు. శాఖ పరిధిలో టీకా వేసేందుకు 65,108 మందిని గుర్తించగా, ఇప్పటి వరకు 21,849 మందికి టీకాలు వేసినట్లు వెల్లడించారు. మిగిలిన వారందరికీ 14వ తేదీ లోపు వేయించాలని సుల్తానియా ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరించాలన్న ఆయన... జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీఆర్డీఓలు, డీపీఓలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: 'టీకా ఉత్సవ్'పై అవగాహన తీసుకురావాలి: కిషన్ రెడ్డి