బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తిప్పికొట్టారు. రైతుబంధు కేవలం భూస్వాములకే దక్కుతుందని కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 91 శాతం సన్న, చిన్న కారు రైతులే ఉన్నారని.. వీరందరికి రైతుబంధు అందుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులతో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పది వేల ఆత్మహత్యలు జరిగాయని బండి సంజయ్ అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జీరో స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. కేంద్రమంత్రి తోమర్ ఆత్మహత్యలు తగ్గాయంటే.. బండి సంజయ్ పెరిగాయంటున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయపరమైన ఆత్మహత్యలు రాష్ట్రంలో లేవని స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలపై దుష్ప్రచారం ఆపాలని హితవు పలికారు. బడ్జెట్ సమావేశాలు కచ్చితంగా జరుగుతాయని.. నిబంధనల ప్రకారం బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపారు. స్వతంత్ర భారత చరిత్రలో బడ్జెట్ ఆమోదించకుండా ఉన్న సందర్భం లేదని ఆయన గుర్తు చేశారు.
''తెలంగాణలో పది వేల ఆత్మహత్యలు జరిగాయని బండి సంజయ్ అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జీరో స్థాయికి చేరుకున్నాయి. కేంద్రమంత్రి తోమర్ ఆత్మహత్యలు తగ్గాయంటే.. బండి సంజయ్ పెరిగాయంటున్నారు. వ్యవసాయపరమైన ఆత్మహత్యలు రాష్ట్రంలో లేవు. రైతు ఆత్మహత్యలపై దుష్ప్రచారం ఆపాలి.'' - పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పబ్లిసిటీ కోసం కార్యకలాపాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆక్షేపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. గవర్నర్ సమస్యలు సృష్టించకుండా హుందాగా ప్రవర్తించాలని వ్యాఖ్యానించారు.
''గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పబ్లిసిటీ కోసం కార్యకలాపాలు చేస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇంకా అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరం. గవర్నర్ సమస్యలు సృష్టించకుండా హుందాగా వ్యవహరించాలి.'' - ఎమ్మెల్సీ ప్రభాకర్
అసలు బండి సంజయ్ ఏమన్నారంటే..? సీఎం కేసీఆర్ రైతు బంధు ఇచ్చి సబ్సిడీలు లేకుండా చేశారని బండి సంజయ్ ఇటీవల ఆరోపించారు. కమిషన్ల పేరుతో రైతులను మోసం చేస్తున్నారని.. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం నాలుగో స్థానానికి చేరిందని పేర్కొన్నారు. కరీంనగర్లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన బండి సంజయ్.. తెలంగాణలో రైతులను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల్లోని రైతులకు చెక్కులు ఇచ్చారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపైనే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తాజాగా స్పందించారు.
ఇవీ చూడండి..
'ముందస్తు ఎన్నికలకు మేము కూడా సిద్ధమే'.. కానీ వన్ కండిషన్: బండి సంజయ్
'లౌకిక విలువలు కాపాడటమే యాత్ర లక్ష్యం.. RSS భావజాలంతో దేశానికి నష్టం'