Palamuru Ranga Reddy lift scheme: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గత నెల 22న జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు కమిటీ ఏర్పాటుకు కృష్ణా బోర్డు కార్యాచరణ ప్రారంభించింది. ఎన్జీటీ తీర్పునకు అనుగుణంగా కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలంటూ కేంద్ర పర్యావరణ- అటవీ మంత్రిత్వ, కాలుష్య నియంత్రణ, జల్‌శక్తి శాఖల కార్యదర్శులకు బోర్డు తాజాగా లేఖలు రాసింది.
పర్యావరణ అనుమతులు లేకుండా ఈ పథకాన్ని నిర్మిస్తున్నందున పర్యావరణ పరిహారం కింద రూ.920.85 కోట్లు చెల్లించాలంటూ ఎన్జీటీ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మూడు నెలల్లోగా కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఈ మొత్తాన్ని చెల్లించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. దాన్ని బోర్డు నేతృత్వంలో నదీ పునరుద్ధరణ కార్యక్రమాలకు వెచ్చించాలని సూచించింది. దీంతో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను బోర్డు వేగవంతం చేసింది.
ఈ నెల 22లోపు కూర్పు: కృష్ణా బోర్డును నోడల్ ఏజెన్సీగా పేర్కొంటూ కమిటీ ఏర్పాటు బాధ్యతలను ఎన్జీటీ అప్పగించింది. తీర్పు వెలువడిన నెల వ్యవధిలోనే అది పూర్తికావాలని సూచించింది. కమిటీ ఏర్పాటైన నాటి నుంచి ఏడాదిలోపు ఏం జరిగిందనేది అది నివేదించాల్సి ఉంటుందని కూడా ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ట్రైబ్యునల్ ఆదేశాల్లో పేర్కొన్న ప్రకారం కేంద్ర మంత్రిత్వశాఖల్లోని సంయుక్త కార్యదర్శి కన్నా పైస్థాయి అధికారుల పేర్లను వీలైనంత త్వరగా పంపాలని కృష్ణా బోర్డు ఆయా శాఖలను కోరింది. ఈ నెల 22లోపు కూర్పు పూర్తయ్యేలా సహకరించాలంటూ లేఖల్లో పేర్కొంది.
ఇవీ చదవండి: