మన మధ్య ఓ 30 గ్రాముల పక్షి బతకలేకపోతే మనం ఏం అభివృద్ధి సాధించినట్టని.. సమాజాన్ని నిలదీస్తాడు పక్షిరాజు. రోబో 2.O చిత్రంలోని ఈ డైలాగ్ ఆలోచింపజేసేదే. నేపథ్యం వేరైనా మనకూ.. ఉన్నాడు ఓ పక్షిరాజు. పశుపక్ష్యాదుల దాహర్తి తీరుస్తూ.. వాటి సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నాడు.
ప్రకృతి ప్రేమికుడు..
జహంగీర్‌కు ప్రకృతే ప్రపంచం. ఉదయం లేచింది మొదలు... పడుకునే వరకు ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంటాడు. అలా అని...అతను శాస్త్రవేత్తో, అధ్యాపకుడో కాదు. ప్రకృతిని ప్రేమించే గొప్ప మనసున్న మామూలు మనిషి. సువిశాలమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని క్యాంపు 5 బస్తీలో భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు.
వేసవిలో ఓ రోజు జహంగీర్... ఓయూలో దాహం వేసి తన వద్ద ఉన్న సీసాలోని నీళ్లన్ని తాగాడు. తన వద్ద తాగడానికి నీళ్లున్నాయి... కానీ ఈ ప్రాంతంలో ఉన్న పక్షులు, జంతువులకు మండు వేసవిలో ఎవరు నీళ్ల ఇస్తారని ఆలోచించాడు. ఓయూలోని పశుపక్ష్యాదులకు నీళ్లు అందుబాటులో ఉంచాలని సంకల్పించాడు.
30కి పైగా నీటి తొట్టెలు ...
బస్తీలో పగిలిపోయిన కుండలను సేకరించి అక్కడక్కడ పెట్టి.. నీళ్లు పోయడం మొదలుపెట్టాడు. పక్షులు, నెమళ్లు, ఉడతలు, ఆవులు నీటిని తాగడం గమనించి సంతోషించేవాడు. ఆ కుండలను కొందరు ఆకతాయిలు పగులగొట్టేవారు. అయినా పట్టువదలని జహంగీర్... ఏకంగా సిమెంట్ తొట్టెలు ఏర్పాటు చేయాలని భావించాడు. సిమెంట్ కొనుగోలు చేసి దాదాపు 30కిపైగా నీటి తొట్టెలు ఏర్పాటు చేశాడు.
ఇంటి నుంచి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ నీటి తొట్టెల్లో ద్విచక్రవాహనంపై వెళ్లి రోజూ నీళ్లు పోసి వస్తుంటాడు. రోజుకు 400 లీటర్ల నీటిని పక్షుల కోసం తీసుకెళ్లి వాటి దప్పిక తీరుస్తూ తృప్తి పొందుతున్నాడు. జహంగీర్ పనిని ప్రతీఒక్కరూ మెచ్చుకుంటున్నారు.
మూడేళ్లుగా ప్రతి వేసవిలోనూ పశుపక్ష్యాదులను కంటికి రెప్పలా చూసుకుంటున్న జహంగీర్... ప్రాణం ఉన్నంత వరకు ఉస్మానియా వర్శిటీలో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు శ్రమిస్తానంటున్నాడు.
ఇదీ చదవండి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భాగ్యనగరం సిద్ధం