ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఆర్‌ఐఎన్‌ఎల్‌లో ఆక్సిజన్ నిల్వలు తగ్గబోతున్నాయి. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కనిపించబోతుంది. ఈ సంస్థ నుంచి ప్రస్తుతం రోజూ 170 టన్నులు వస్తుండగా.. రానున్న రోజుల్లో 100 టన్నులే రాబోతున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ఆర్‌ఐఎన్‌ఎల్‌లో ఉన్న నిల్వలు తరిగిపోయినందున ప్రస్తుతం ఏరోజుకారోజు తయారయ్యే ఆక్సిజన్ మాత్రమే కేంద్రం కేటాయించిన మేరకు వస్తోంది. అయితే.. ఇది కూడా 70 టన్నుల మేర తగ్గుతుందని సమాచారం వచ్చినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి అయితే అవసరం ఉన్నచోటుకు త్వరగా ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇప్పుడు తగ్గే 70 టన్నుల ఆక్సిజన్ ఎక్కడినుంచి పొందాలి..? అందుకు కేంద్రాన్ని ఎలా ఒప్పించాలన్న విషయమై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.
ఒడిశాపై పొరుగు రాష్ట్రాల ప్రభావం..
ఒడిశాలోని అంగుల్, రవూర్కెలా నుంచి కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాలూ రైలుమార్గం ద్వారా ఆక్సిజన్ తెప్పించుకోవడం మొదలుపెట్టాయి. దీనివల్ల డిమాండు పెరిగి, రాష్ట్రానికి కేటాయించిన కోటా (127 టన్నులు) పొందేందుకు ఎక్కువ సమయం పడుతోంది. మిగిలిన రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరగడంతో రాష్ట్రానికి ఆక్సిజన్ రావడం ఆలస్యం అవుతోంది. వాతావరణం అనుకూలించనందున ఆకాశమార్గంలో పంపడం ఒకోసారి కుదరట్లేదు. అన్నిచోట్ల నుంచి 80 ట్యాంకర్లు, 11 చిన్న ట్యాంకుల ద్వారా ఏపీలోని వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. దుర్గాపుర్, జంషెడ్‌పుర్, జామ్‌నగర్ నుంచి 180 టన్నుల సరఫరా జరుగుతోంది.
రోజుకు 800 టన్నుల అవసరం..
కేంద్రం కేటాయించిన సంస్థల నుంచి రాష్ట్రానికి ఈ నెల 8న 590 టన్నుల ఆక్సిజన్ వచ్చింది. 16 నాటికి ఇది 609.5 టన్నులకు చేరింది. ఇకపై కనీసం రోజుకు 800 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని అంచనా. రాష్ట్రంలో ప్రస్తుతం 635 టన్నుల ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది.
తమిళనాడు, కర్ణాటక నుంచి..
తమిళనాడులోని ఐనాక్స్ శ్రీపెరంబుదూరు నుంచి ప్రస్తుతం 20 టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రానికి తెప్పిస్తున్నారు. దీనిని 25 టన్నులకు, సెయింట్ గోబెయన్ లిండే నుంచి ప్రస్తుతం వస్తున్న 15 టన్నులతో పాటు మరో 10 టన్నుల ఆక్సిజన్‌ను పంపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఇక్కడ ఆక్సిజన్ కోటాను పెంచకుంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ప్రభావం పడుతుందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన జేఎస్‌డబ్ల్యూ ప్లాంటు నుంచి 20 టన్నుల ఆక్సిజన్ రోజూ వస్తోంది. దీనిని 40 టన్నులకు పెంచేలా కేంద్రాన్ని సంప్రదించాలని భావిస్తున్నారు. బళ్లారిలోని లిండే నుంచి ఇస్తున్న 43 టన్నులను 70 టన్నులకు పెంచాలని కోరేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
ఇతర ఏర్పాట్లు ఇలా..
కృష్ణా, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 6 మెడికల్ ఆక్సిజన్ పరిశ్రమల నుంచి 25.25 టన్నుల ఆక్సిజన్ పొందేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విశాఖపట్నం, నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మరో 5 సంస్థల నుంచి 48.20 టన్నుల ఆక్సిజన్ తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురంలోని అర్జాస్ స్టీల్ సంస్థ నుంచి 25 టన్నుల సరఫరా జరగబోతుంది. విశాఖలోని అరబిందో, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ది మైలాన్, ది మెట్రో కెమ్ సంస్థల నుంచి నైట్రోజన్‌ను ఆక్సిజన్‌గా మార్చి 2.40 టన్నులను అదనంగా పొందేందుకు వీలుందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: కరోనా భయం.. ఫోన్ చేస్తే అభయం