విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏటా ముందు స్థానంలో ఉంటుంది. కరోనా సమయంలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి.. అమెరికా విశ్వవిద్యాలయాల తరహాలో దేశానికి రాకుండానే ఆన్‌లైన్ పాఠాలు బోధించేందుకు నిర్ణయించింది. కొవిడ్-19 కారణంగా విదేశీ ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడం సాధ్యమయ్యేలా లేదు.
నగరంలోని విశ్వవిద్యాలయాలకు ఏటా పెద్ద సంఖ్యలో విదేశీ విద్యార్థులకు వస్తుంటారు. వీరిలో 70-80 శాతం మంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు ఆన్‌లైన్‌లో కల్పించాలని ఓయూ నిర్ణయించింది. గతంలో యూనివర్సిటీకి వచ్చాక ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి ప్రవేశాలు కల్పించేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు పరిశీలించి, ప్రవేశాలు కల్పించనున్నారు. తర్వాత పరిస్థితులు చక్కబడి నేరుగా వర్సిటీకి వచ్చినప్పుడు మరోసారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. అర్హత లేదని తేలితే ప్రవేశం రద్దు నిబంధన విధించారు.
ప్రస్తుతం ప్రవేశాలు కల్పించాక మొదటి సెమిస్టర్ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇప్పటికే స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమంలో ప్రవేశాలు పొందే విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు వినేందుకు కేంద్రం అనుమతించింది. ‘గతంతో పోల్చితే ఈసారి ఉస్మానియాకు విదేశీ విద్యార్థుల దరఖాస్తులు ఎక్కువగానే వచ్చాయి. ఆన్‌లైన్‌లో ప్రవేశాలు కల్పించి ఆన్‌లైన్ బోధన చేపట్టాలని యోచిస్తున్నాం. ఈ కార్యక్రమం ఏ విధంగా చేపట్టాలనే విషయంపై కసరత్తు జరుగుతోంది.’ అని ఉస్మానియా విదేశీ వ్యవహారాల విభాగం సంయుక్త సంచాలకులు జాస్తి రవికుమార్ వివరించారు.
చివరి ఏడాది పరీక్షలెలా?
మార్చిలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాక చివరి ఏడాది చదువుతున్న కొందరు విద్యార్థులు స్వదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నందున విదేశాలకు వెళ్లిపోయిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహించాలనే విషయమై వర్సిటీ కసరత్తు చేస్తోంది. ఆయా దేశాల ఎంబసీలకు పిలిపించి అక్కడే పరీక్ష నిర్వహించే విషయంపై సంప్రదింపులు జరుపుతోంది.
దరఖాస్తులు ఇలా..
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఉస్మానియాలో యూజీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు విదేశీ విద్యార్థులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమంలో పీజీ కోర్సుల్లో చేరేందుకు 220 దరఖాస్తులు రాగా 114 దరఖాస్తులకు ఓయూ ఆమోదం తెలిపింది. యూజీ కోర్సుల కోసం 140 మంది దరఖాస్తు చేసుకోగా.. పరిశీలన ప్రక్రియ నడుస్తోంది. వీటితోపాటు భారత సాంస్కృతిక సంబంధాల మండలి(ఐసీసీఆర్), నేరుగా వచ్చిన దరఖాస్తులు అన్ని కలిపితే 1100 ఉన్నాయి. ఏటా వేయి దరఖాస్తులు వస్తుండగా ఈసారి అంతకుమించి వచ్చాయి. ఈ సారి యూజీ కోర్సుల్లో ప్రవేశానికి నేరుగా, ఐసీసీఆర్ తరఫున 250 మంది, పీజీ కోసం 130, పీహెచ్‌డీ కోసం 70 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి: మనుషులకే కాదు.. శునకాలకూ ఓ 'బ్లడ్ బ్యాంక్'