పీఆర్సీ అమలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న నిరాహారదీక్ష చేపట్టాలని రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, ప్రభుత్వ రంగ, ఒప్పంద ఉద్యోగుల ఐక్యవేదిక నిర్ణయించింది. అదే రోజున కలెక్టర్ కార్యాలయాలు, మండల కేంద్రాలు, విద్యా సంస్థల్లో మధ్యాహ్నం భోజన విరామంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో ఐక్యవేదిక ప్రతినిధులు మెమోరండం సమర్పించారు. అంతకుముందు ఐకాస ఛైర్మన్ కె.లక్ష్మయ్య అధ్యక్షతన ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. పీఆర్సీ నివేదికను వెంటనే బహిరంగ పరిచి ఈనెలాఖరున ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో ఇచ్చిన హామీల అమలు కోసం ఉత్తర్వులు జారీ చేయాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది.
పీఆర్సీ నివేదిక సమర్పించి 15 రోజులైనప్పటికీ... సిఫార్సులను వెల్లడించడం లేదని ఐక్యవేదిక సభ్యులు ఆరోపించారు. కాబట్టి సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న ధర్నాచౌక్ వద్ద నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించింది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి 15 తర్వాత ప్రత్యక్ష కార్యాచరణను చేపట్టాలని సమావేశం నిర్ణయించినట్లు ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చూడండి: రేపు మొదటి డోసు వ్యాక్సినేషన్... నేనూ టీకా తీసుకుంటా: ఈటల