MLC Narsireddy On old pension scheme : కొత్త పింఛన్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు కావడానికి ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక అత్యవసరమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నూతన పింఛన్ విధానం ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ నుంచి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధానంతో ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. తమ పోరాటంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు చేరాలని కోరారు.
కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధిరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సుమారు 17 సంఘాల సయుక్త సమావేశం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో సుందరయ్య కళా నిలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న నర్సిరెడ్డి.. అనంతరం ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాత పింఛన్ విధానం రద్దు చేస్తుందా..! లేదా గద్దె దిగుతుందా..! అనే నినాదంతో ఐక్యవేదిక ముందుకు సాగాలని ఆయన సూచించారు.
"కొత్త పింఛన్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు కావడానికి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక అవసరం. నూతన పింఛన్ విధానం ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ నుంచి వచ్చింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం పాత పింఛన్ విధానం రద్దు చేస్తుందా..! లేదా గద్దె దిగుతుందా..! అనేది మన నినాదం కావాలి."-అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్సీ
రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పింఛన్ విధానంపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. సీఎం కేసీఆర్ ఈ విషయంపై స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న సీపీఎస్ రద్ధు చేసి ఓపీఎస్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టదాయకమైన కొత్త ఫించన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఐక్యవేదిక కన్వీనర్ అజిత్ ప్రభుత్వాన్ని కోరారు.
Employees old pension scheme : పాత ఫించన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 10న చలో దిల్లీ పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి: మరోవైపు జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఉద్యోగ సంఘం నిరసనకు సిద్దమైంది. ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరింది. ఈ మేరకు ఈనెల 29న హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ దగ్గర నిరసన ర్యాలీ ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఉద్యోగ సంఘాల నాయకులు విడుదల చేశారు.
ఇవీ చదవండి: