రాష్ట్రంలో ఎన్నికలకు ముందే క్రమక్రమంగా రాజకీయ వేడి పెరుగుతోంది. తెరాస అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై అధికార- విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానన్న కేసీఆర్ నిర్ణయం భాజపాకే లబ్ధిచేసేలా ఉన్నాయని కాంగ్రెస్ విమర్శించింది. భాజపాకి మద్దతిచ్చే పార్టీలను ఎందుకు కలవడం లేదని నిలదీసిన మధుయాస్కీ కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే జాతీయపార్టీ ప్రయత్నాలని ఆరోపించారు. దిల్లీ మద్యం కుంభకోణం నుంచి తప్పించుకునేదుందుకే భాజపాకి కేసీఆర్ అంతర్గతంగా సహకారం అందిస్తున్నారని మధుయాస్కీ మండిపడ్డారు.
కేసీఆర్ జాతీయ పార్టీ పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారు: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. నాలుగేళ్ళుగా కేసీఆర్ జాతీయ పార్టీ, ఫ్రంట్ పేరుతో ప్రజలను ఊరిస్తున్నారని తిరుపతిలో భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కుటుంబపాలన, అవినీతి పాలన దేశానికి రుచి చూపేందుకే.. జాతీయ పార్టీ పెడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు: కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని అంతా ఆకాంక్షిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్కసమన్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. తెరాస భవన్‌లో మీడియా మాట్లాడిన నేతలు.. భాజపా పాలనలో దేశానికి దశ, దిశ లేకుండాపోయిందని ఈ తరుణంలో కేసీఆర్ వేగుచుక్కగా మారారని పేర్కొన్నారు.
కాంగ్రెస్, భాజపా నేతలకు కళ్లు మండుతున్నాయి: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, భాజపా నేతలకు కళ్లు మండుతున్నాయని మంత్రిగంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా నియమితులైన పొన్నం అనిల్‌కుమార్ గౌడ్ అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు. ఒకవేళ కాంగ్రెస్, భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నీళ్ళు, కరెంట్ ఎత్తుకుపోతారని గంగులకమలాకర్ ఆందోళన వ్యక్తంచేశారు.
కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ పెట్టడం మంచిదే: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ పెట్టడం మంచిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. భాజపాకు వ్యతిరేకంగా పెట్టే ఫ్రంట్‌ను బలపర్చేలా అడుగులుంటే మంచిదని నారాయణ సూచించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ విధివిధానాలు, ఎక్కడెక్కడ పోటీ చేస్తారన్న అంశాలపై రాజకీయ పార్టీలు.. సాధారణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి: KCR National Party: దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన!
నేడు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
'సిగ్నల్ జంప్ చేశా.. ఫైన్ కట్టొచ్చా?'.. బిర్లా ట్వీట్‌కు పోలీసుల షాకింగ్ రిప్లై