Opposition parties Telangana Elections Campaign 2023 : తెల్లవారుజామునుంచే మైకుల మోత, ప్రచార రథాల రాకతో ఊరూవాడల్లో ఎన్నికల కోలాహాలం నెలకొంది. రాజకీయ పార్టీల నేతల పర్యటనలు, అభ్యర్థుల ఇంటింటి ప్రచారాలతో గ్రామాలు, పట్టణాలు సందడిగా మారుతున్నాయి. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించటంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ఓ దఫా నియోజకవర్గాలను చుట్టేయటంతో అధికార పార్టీకి పోటీగా విపక్ష పార్టీలు సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు, ఆశావహులు ఇంటింటికి వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
Telangana Election Campaign 2023 : క్రికెట్ మైదానంలో జట్టును విజయతీరాలకు చేర్చినట్టుగానే.. ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తానని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ తెలిపారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. పార్టీ గెలుపు కోసం సమష్టిగా సాగుదామని కోరారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్వేల్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఖమ్మంలో తొలి మలిదశ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.. కేసీఆర్ ఒక్కరు పోరాడితే ప్రత్యేక రాష్ట్రం రాలేదన్నారు. నిరంకుశ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలని కోదండరాం పిలుపునిచ్చారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు కార్యకర్తలు హస్తం గూటికి చేరారు. మహబూబాబాద్ మండలంలోని పలుగ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఏఐసీసీ అధికార ప్రతినిధి అనిల్‌కుమార్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా మురళీనాయక్ విజయాన్ని కాంక్షిస్తూ.. కమ్మ సంక్షేమ సంఘం నాయకులు శాంతికపోతాలను ఎగురవేశారు. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్‌రెడ్డి ఇంటింటికి వెళ్తూ ఓట్లు అభ్యర్థించారు.
ప్రచారానికి వెళ్తున్న జైవీర్‌రెడ్డి వాహనాలను విజయపురి వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శంకాపూర్, నార్సింగ్ మండలం జప్తిశివునూర్ గ్రామాల్లో.. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ప్రచారం చేశారు. నియోజకవర్గంలో అవినీతి తప్పిస్తే అభివృద్ధిలేదంటూ స్థానిక ఎమ్మెల్సీ పద్మాదేవేందర్‌రెడ్డిపై ఆయన ఆరోపణలు చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలంటూ జగిత్యాల జిల్లా కోరుట్లలో రైతులు ఆందోళనకు దిగారు. కోరుట్లలో జరిగే బీఆర్ఎస్ సభలో చక్కెర కర్మాగారంపై సీఎం ప్రకటన చేయని పక్షంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో రైతులమంతా పోటీచేస్తామని ప్రకటించారు.
Telangana Assembly Elections 2023 : పార్టీ పొత్తులు, టికెట్ల కేటాయింపుతో ఇన్నాళ్లు పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని.. తమ ఆవేదనను నాయకత్వం పట్టించుకోవటంలేదంటూ హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన పలువురు బీజేపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్ మాధవరం కాంతారావు, సీనియర్ నేతలు, రాజేశ్వరరావుతో పాటు మరికొందరు నాయకులు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. భూపాలపల్లిలో బీజేపీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేశారు.
మాజీ ఎంపీ వివేక్ బీజేపీను వీడటం పట్ల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్‌రెడ్డి.. మారంపల్లి గ్రామంలో ప్రచారం చేశారు. గెలిచిన ఏడాదిలోగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట ఇవాళ జరగనున్న బీజేపీ బహిరంగ సభకు పార్టీ నేత ఈటల రాజేందర్ హాజరుకానున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన చలమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరారు.
Change of Parties Of Politicians : ఇటీవల తిరిగి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డికి టికెట్ కేటాయించటం పట్ల అసంతృప్తికి గురైన ఆయన.. దిల్లీలో కిషన్‌రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల తిరిగి కాంగ్రెస్‌లోకి రావటంతో తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ మునుగోడు నాయకురాలు పాల్వాయి స్రవంతి ఖండించారు. హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలో మజ్లిస్ అభ్యర్థి కౌసర్ మొయినుద్దీన్.. లంగర్‌హౌజ్‌లోని పలుబస్తీల్లో పాదయాత్ర చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జై మహాభారత్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా యుద్ధభేరీ సభ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు మహిళా అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు భగవాన్ అనంతవిష్ణు ప్రభు తెలిపారు.