కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని రాష్ట్రంలోని భాజపాయేతర ప్రతిపక్షాలు నిర్ణయించాయి. భూ సమస్యలు, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల అమలు, ధరణిలో లోపాలు, పోడు భూముల సమస్యలపైనా కలిసి పోరాటం చేయనున్నట్లు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తెజస, తెలంగాణ ఇంటిపార్టీ, న్యూడెమోక్రసీ తదితర పార్టీలు ప్రకటించాయి. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఇతర పార్టీల నేతలు పీఎల్.విశ్వేశ్వర్‌రావు, పోటు రంగారావు (సీపీఐఎంఎల్), కె.గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ), సీపీఐ ఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి రాజేష్, పీవైఎల్ కార్యదర్శి రాము, పీడీఎస్‌యూ కార్యదర్శి రాము, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ కిసాన్‌సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడారు.
కలసికట్టుగా పోరాటం: రేవంత్
భాజపాయేతర విపక్ష పార్టీలతో కలిసి ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటానికి నిర్ణయించినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారమయ్యేవరకు ఉద్యమాలు చేస్తామన్నారు. ధరణి వెబ్‌సైట్లో దాదాపు 25 లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని దీంతో సామాన్యులు, పేద రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన లక్షల ఎకరాల పోడు భూములను ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పేరుతో బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడతామన్నారు. 27న రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌బంద్‌లో భాగంగా హైదరాబాద్ సహా జిలాల్లోని రహదారులను దిగ్బంధనం చేయనున్నట్లు ప్రకటించారు. 30న సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు. అక్టోబరు 5న పోడు భూముల సమస్యపై అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు 400 కి.మీ. మేర రాస్తారోకో నిర్వహిస్తామన్నారు.
పరిష్కారమయ్యేదాకా వదలం: తమ్మినేని
పోడు భూములపై ప్రతిపక్ష పార్టీలు పోరాడతాం అనగానే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. వెంటనే కమిటీ వేస్తున్నట్లు సీఎం ప్రకటించారని, అలాంటి కంటితుడుపు చర్యలతో తమ పోరాటం ఆగేది కాదన్నారు. ప్రజలను ఇబ్బందిపెడుతున్న కేంద్ర, రాష్ట్ర విధానాలపై పోరాడతామని చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ప్రొ.కోదండరాం మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కుతూ పోడుభూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. పోటు రంగారావు, గోవర్ధన్, చెరుకు సుధాకర్, రాజేశ్ తదితరులు మాట్లాడారు.
మహాధర్నాలో పాల్గొననున్న ఏచూరి
ఇందిరాపార్కు వద్ద బుధవారం తలపెట్టిన మహాధర్నాలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు. 27న భారత్‌బంద్‌ను అన్ని పక్షాలూ విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: Congress: అధికారంలోకి రాగానే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు: మల్లికార్జున ఖర్గే