రాష్ట్రంలో ఆన్‌లైన్ నమోదు నిబంధన తేవడం వల్ల విత్తన సంస్థల మోసాలు వెలుగులోకివచ్చాయి. ఇన్నాళ్లు విత్తనోత్పత్తి సంస్థలు పంటలను సాగుచేయకుండా బోగస్ రైతుల పేర్లతో వ్యవసాయశాఖకు వివరాలిచ్చి విత్తనాలు ప్రభుత్వానికి విక్రయించేవారు. వాటినే రాయితీ విత్తనాల పేరుతో రైతులకు విక్రయించే వ్యవహారం సాగేది. ఈ నాసిరకం విత్తనాల వ్యాపార మోసాలను అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కొత్త నిబంధనలను అమల్లోకి తేవడం వల్ల విత్తన పంటల సాగు అసలు రంగు బయటపడింది.
ఎక్కడ తెచ్చారనే వివరాలు ఇవ్వాల్సిందే...
ప్రతి విత్తన కంపెనీ ఏ రైతుతో ఏ ప్రాంతంలో విత్తన పంట సాగు చేయించినా... ఆ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందజేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. విత్తన పంట సాగు చేసే భూమి సర్వే నంబరు, రైతు పేరు, పంట విత్తన చరిత్ర, దాని మూల విత్తనం ఎక్కడ తెచ్చారనే సమగ్ర వివరాలన్నీ విత్తన కంపెనీ సమర్పించాలి.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి...
రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థకు ఆన్‌లైన్‌లో సాక్ష్యాలతో సహా అందజేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ ప్రక్రియ అంతా 2018 నుంచి రాష్ట్రంలో అమలుచేశారు. ఆధారాలతో సహా లెక్కలడిగే సరికి ఒక్కసారిగా విత్తనోత్పత్తి భారీగా పడిపోయింది.
ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్లైన్సేవలు...
2015-16లో 2 లక్షల 63వేల ఎకరాల్లో విత్తన పంటలు సాగవగా... 2018-19లో లక్షా 68 వేల ఎకరాలకు పడిపోయింది. ఇలా ఆన్‌లైన్ విధానం వల్ల విత్తనోత్పత్తి సంస్థల ఆట కట్టించినందుకు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రశంసించింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్‌లైన్ సేవలను విస్తరించాలని నిర్ణయించింది.