ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామపత్రాలను ఆన్‌లైన్‌లోనూ తీసుకునే ఏర్పాట్లు విధిగా చేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (పీఆర్)శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌ను ఆదేశించారు. ఆన్‌లైన్ విధానంతో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, దౌర్జన్యాలు, అపహరణలు, నామినేషన్ పత్రాలు లాక్కోవడం వంటి సంఘటనలను నిరోధించే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ఇదెంతో దోహదం చేస్తుందని వివరించారు. మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ నుంచే ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించినా... ఎందుకు చేపట్టలేదని ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ను ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో ఆన్లైన్లో నామినేషన్లు తీసుకునే ఏర్పాట్లు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలపై ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ సోమవారం ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ ఎదుట హాజరయ్యారు.
ఆన్‌లైన్ విధానంలో నామినేషన్ల స్వీకరణ కోసం పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయాల్సి ఉందని... ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల సాధ్యం కాలేదని ముఖ్య కార్యదర్శి, కమిషనర్ వివరణ ఇచ్చారని సమాచారం. తమ ప్రయత్న లోపం లేదని, పరిపాలన పరంగా, సాంకేతికంగా సాధ్యం కానందునే ఆన్‌లైన్ విధానాన్ని తీసుకురాలేకపోయామని తెలిపారని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే వారందరికీ ఎంతో వెసులుబాటుగా ఉండాలన్న ఉద్దేశంతో ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోందని, రెండో దశ ఎన్నికల్లో ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరించేలా విధిగా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆదేశించారని సమాచారం.
ఇదీ చదవండి: రూ. 5 భోజనం చేసిన మున్సిపల్ కమిషనర్