ఏపీలోని కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడుకు చెందిన కవిత - వెంకట్రామిరెడ్డి దంపతుల కుమార్తె రజిత.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లికి చెందిన మధుసూదన్ రెడ్డి- శైలజారెడ్డి దంపతుల కుమారుడు దినేష్ రెడ్డి.. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. డింబోలాలో ఉద్యోగం సాధించి, అక్కడే స్థిరపడ్డారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు. కరోనా కారణంగా స్వదేశానికి రాలేకపోయారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వివాహం చేసుకున్నారు.
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వర్చువల్ విధానానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నో సమావేశాలు, కార్యక్రమాలు ఆన్లైన్ వేదికగా జరుగుతున్నాయి. ఈ తరహాలో వివాహం చేసుకోవాలని ఆస్ట్రేలియాలో ఉన్న రజిత, దినేష్ భావించారు. ముహూర్తం కుదుర్చుకుని వేడుకకు సిద్ధమయ్యారు. కర్నూలులోని ఓ కల్యాణమండపంలో పురోహితుడితో సహా రెండు కుటుంబాల పెద్దలు, బంధువులు హాజరయ్యారు. తెర మీద పెళ్లికుమార్తె, కుమారుడిని చూస్తూ.. బంధువులు పెళ్లిని తిలకించారు. పురోహితుడు వేదమంత్రాలు చదువుతూ.. వర్చువల్ గా పెళ్లి జరిపించారు. మంగళవాద్యాల నడుమ వివాహ క్రతువు ఘనంగా జరిగింది. ఇలాంటి పెళ్లిని మొదటిసారి చూసినవారంతా.. ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇదీ చూడండి: పంతులు రాలేదు కానీ... వేదమంత్రోశ్ఛరణల మధ్యే పెళ్లి జరిగింది