ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి నుంచి వరద తగ్గింది. తుంగభద్రకు వరద ప్రవాహం పెరిగింది. 24 గంటల వ్యవధిలో తుంగభద్ర జలాశయంలోకి 8.99 టీఎంసీల నీళ్లు చేరాయి. శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 24 వేల క్యూసెక్కులు వస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతలతో మధ్య మానేరుకు 15 వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 22 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(కన్నెపల్లి) పంపుహౌస్ నుంచి సోమవారం 9 మోటార్ల ద్వారా జలాల ఎత్తిపోతను కొనసాగించారు. కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన ప్రాణహిత ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. మేడిగడ్డ బ్యారీజీ నుంచి 76,600 క్యూసెక్కులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు నుంచి 61,152 క్యూసెక్కుల కిందకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రం 5గంటలకు 22.5 అడుగులకు పెరిగింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మూల వాగు, మహాముత్తారం మండలం కాటారం-మేడారం కేశవపూర్ సమీపంలోని లోలెవల్ వంతెన, కనుకునూర్ వద్ద చెలిమెల వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. 24 గంటల వ్యవధిలో నిజామాబాద్ జిల్లా ఆలూరులో 17.1 సెంటీమీటర్లు, నవీపేటలో 16.6, రంజల్‌లో 13.8 వర్షం కురిసింది.