Kanti Velugu Scheme reached one and half crore tests in Telangana : రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్యసేవలు అందించే లక్ష్యంతో 2018 ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 8 నెలలపాటు సాగిన తొలి విడత కార్యక్రమంలో కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి 50 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. అవసరమైన వారికి మందులు ఇచ్చారు.
సుమారు కోటిన్నర కంటి పరీక్షలు: అయితే ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో 2023 జనవరి 18న రెండోవిడత కంటివెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 74 రోజుల్లో 82 శాతం మందికి కంటి పరీక్షలు చేశారు. నిర్దేశించుకన్న జూన్15 వరకు 100 రోజుల కార్యక్రమంలో రాష్ట్రంలోని వారందరికీ పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కంటివెలుగు సమయంలో ఇతర వైద్యసేవలకి అంతరాయం లేకుండా జాగ్రత్తలు చేపట్టింది. ఈనెల12 వరకు రాష్ట్రంలోని 10 వేల285 పంచాయతీ 3221 మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు కోటి 42 లక్షల 30 వేల 500 మందికిపైగా పరీక్షలుచేయించుకోగా 20లక్షల 69వేల మందికి కంటి అద్దాలు ఇచ్చినట్లు వివరించారు. కార్యక్రమం పూర్తయ్యే నాటికి దాదాపు 2 కోట్లమందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు.
దగ్గరి చూపే ఇబ్బంది: అన్ని జిల్లాలో అధికంగా దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు వైద్య శిబిరాల్లో నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 40 ఏళ్ల వయస్సు పైబడిన చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారని అదికారులు తెలిపారు. అలాంటి వారికి తక్షణమే రీడింగ్ గ్లాసెస్ అందిస్తున్నారు. వాటితోపాటు కంటిసమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందుతో పాటు విటమిన్ ఏ, డీ, బీకాంప్లెక్స్ పంపిణీచేస్తున్నారు.
కంటిశుక్లాల సమస్యతో బాధపడుతున్న వృద్ధులు: 50 ఏళ్లు పైబడిన వారు అధికంగా కంటిశుక్లాల సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి చికిత్సచేసే సమయాన్ని చరవాణి ద్వారా సమాచారమిస్తున్నట్లు వైద్యసిబ్బంది చెబుతున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తై ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కార్యక్రమం విజయవంతానికి కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ సహా పలు శాఖల అధికారులు వైద్య శిబిరాల నిర్వహణకు ముందుగానే ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు నిరంతర పర్యవేక్షణ, రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించుకుంటూ కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నారు.
ఇవీ చదవండి