IAS Transfers in Telangana: రాష్ట్రంలో పలు దఫాలుగా వినిపించిన ఐఏఎస్ అధికారుల బదిలీ అంశం మరోమారు తెరమీదకు వచ్చింది. కొన్ని జిల్లాల కలెక్టర్లు సహా సీనియర్ అధికారులను బదిలీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి గతంలోనే పలుమార్లు ఐఏఎస్ అధికారుల బదిలీ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో సీఎస్ మార్పు సమయంలో కొంత మంది అధికారులను బదిలీ చేశారు. పలువురు జిల్లా కలెక్టర్లను కూడా బదిలీ చేశారు.
Telangana IAS Transfers : కొన్ని జిల్లాలకు మాత్రం ఇంకా పూర్తి స్థాయి కలెక్టర్లను నియమించకపోవడంతో ఇన్‌ఛార్జ్‌లు బాధ్యతల్లో ఉన్నారు. సీనియర్ అధికారుల స్థాయిలోనూ పలు పోస్టులకు పూర్తి స్థాయి అధికారులు లేరు. దీంతో ఆయా బాధ్యతలను అదనంగా నిర్వర్తిస్తున్నారు. వీటికి తోడు ఇటీవలి కాలంలో పలు పోస్టులు కూడా ఖాళీ అవుతున్నాయి. వ్యక్తిగత కారణాలతో పలువురు అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. రజత్ కుమార్ షైనీ, మాణిక్ రాజ్, ప్రీతిమీనా ఇప్పటికే కేంద్ర సర్వీసులకు వెళ్లగా... యోగితారాణా, నీతూ ప్రసాద్ కూడా త్వరలోనే కేంద్ర సర్వీసులకు వెళ్తారని అంటున్నారు. మరికొందరు అధికారులు సెలవుపై వెళ్లారు.
కీలకమైన శాఖలకు పూర్తిస్థాయిలో కార్యదర్శులు లేరు: ఇటీవలి కాలంలో పది మంది అధికారులకు ఐఏఎస్ హోదా వచ్చినప్పటికీ వారు పాత విధుల్లోనే కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కీలకమైన గనులు, అటవీ, తదితర శాఖలకు పూర్తి స్థాయి కార్యదర్శులు లేరు. కొందరు అధికారులకు మూడు, నాలుగు అదనపు బాధ్యతలు కూడా ఉన్నాయి. కొందరు పోస్టింగుల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. శైలజా రామయ్యర్, దాసరి హరిచందన, ముషారఫ్ అలీ ఫారుఖీ, నిఖిల, తదితరులకు పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల బదిలీ అంశం మరోమారు చర్చనీయాంశం అయింది.
ఐఏఎస్ అధికారుల బదిలీ అంశంపై సీఎం దృష్టి: ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఐఏఎస్ అధికారుల బదిలీ అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా అధికారుల బదిలీలు పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బదిలీలు జరుగుతాయని అంటున్నారు. అటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి పోస్టుతో పాటు అదనపు ఎన్నికల ప్రధానాధికారి పోస్టు ఖాళీగా ఉంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు అధికారులు కీలకమైన తరుణంలో... ఆ రెండు పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదన వచ్చింది. త్వరలోనే ఐఏఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఇవీ చదవండి: