నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతోన్న సందర్భంగా ఈనెల 26న రాజ్‌భవన్ ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున అన్ని జిల్లా కేంద్రాల ముందు ధర్నాలు చేపడతామని వెల్లడించాయి.
రైతులు నెలల కొద్ది పోరాడుతోన్నా కేంద్రం పట్టించుకోవడం లేదని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటంలో ఇప్పటికే 500 మంది ప్రాణాలు కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల గురించి కనీస ఆలోచించకుండా మోదీ, దోపిడీదారులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కలిసి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు గతేడాది నవంబరు 26 నుంచి దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం సుప్రీంకోర్టుకు చేరడంతో సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని కేంద్రం ప్రతిపాదించగా.. పూర్తిగా రద్దు చేయాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,556 కరోనా కేసులు, 14 మరణాలు