Ambedkar 125 Feet Statue in Hyderabad: హైదరాబాద్‌కు మరో ఘనత దక్కబోతోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల్లో.. దేశంలోనే అతి పెద్దది హైదరాబాద్‌లో సిద్ధమైంది. ఆయన 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల భారీ లోహమూర్తి అంతెత్తున ఠీవిగా నిలిచింది. అంబేడ్కర్ పుట్టిన రోజు వేళ.. ఈ నెల 14వ తేదీన ఈ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
హుస్సెన్‌సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్ పక్కన 11 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు.. అనేక విశేషాల సమాహారంగా రూపుదిద్దుకుంటోంది. 2016లోనే విగ్రహ నిర్మాణానికి ఆలోచన పురుడు పోసుకున్నా.. పూర్తి స్థాయిలో కార్య రూపంలోకి రావటానికి సుమారు ఏడేళ్లు పట్టింది. ఇంత భారీ విగ్రహ నిర్మాణ సామర్థ్యం దేశీయంగా ఉందా? లేదా? అన్న మీమాంసతో అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో అధికారుల బృందం, ప్రజాప్రతినిధులు చైనాలో పర్యటించి వివిధ విగ్రహ తయారీ సంస్థలతో చర్చించారు.
తర్వాత కరోనాతో పాటు చైనాతో నెలకొన్న భారత దేశ సంబంధాల నేపథ్యంలో విగ్రహాన్ని స్వదేశంలోనే తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహ నమూనా రూపకల్పన, నిర్మాణ వ్యవహారాల కోసం టెండర్లు పిలిచారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాం వన్‌జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్‌లు కలిసి విగ్రహ నమూనాలు డిజైన్ చేశారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అంబేడ్కర్ విగ్రహ తయారీ బాధ్యతను వారికి అప్పగించింది. విగ్రహ భాగాలను దిల్లీలో పోత పోసి హైదరాబాద్‌కు తరలించారు. కేపీసీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ బాధ్యతను చేపట్టింది.
353 టన్నుల ఉక్కు.. 112 టన్నుల కాంస్యం..: ఎలాంటి విపత్తులు ఎదురైనా తట్టుకునేలా.. విగ్రహం చెక్కు చెదరకుండా ఉండేందుకు పటిష్ఠమైన లోహ సామగ్రిని వినియోగించారు. 112 టన్నుల కాంస్యం, 353 టన్నుల ఉక్కుతో విగ్రహాన్ని తయారు చేశారు. మొదట లోపల ఉక్కుతో భర్తీ చేసి.. పైన కాంస్యంతో రూపొందించారు. నేటి భారతదేశ పార్లమెంటు ఆకృతిలో రూపొందించిన స్మారక భవనాన్నే బేస్‌మెంట్‌గా చేసుకుని.. పైన అంబేడ్కర్ విగ్రహాన్ని నిలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను ఆవిష్కరించే మ్యూజియం, కాన్ఫరెన్స్ హాల్, ఆయన రచనలతో కూడిన గ్రంథాలయం ఇలా అన్నింటినీ స్మారక భవనంలో ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ చదవండి: