ఓఎల్‌ఎక్స్ వేదికగా సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తప్పుడు వివరాలు, నకిలీ ప్రకటనలతో నిలువునా ముంచేస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు గతేడాదిలో 3 వేల 838 నమోదయ్యాయంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు జాగ్రత్తలు పాటించాలని సైబర్ క్రైం పోలీసులు మొత్తుకుంటున్నా... నిత్యం పలువురు ఓఎల్‌ఎక్స్ మోసగాళ్ల బారిన పడి బాధితులవుతున్నారు. ఓఎల్‌ఎక్స్ ప్రకటనలపై ఆకర్షితులయ్యే విధంగా మోసగాళ్లు వ్యవహరిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రకటనల్లో అధిక శాతం సైబర్‌నేరగాళ్లవే కావడం గమనార్హం. ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రకటనలు ఓఎల్‌ఎక్స్‌లో పెట్టే వీలుండడం వల్ల అది సైబర్ నేరగాళ్ల పాలిట వరంగా మారుతోంది.
ముందు సగం.. వస్తువు తీసుకునేటప్పుడు సగం..
ఆకర్షనీయమైన వాహనాలు విక్రయిస్తామంటూ... వాటి ఫొటోలు ఓఎల్‌ఎక్స్‌లో పెడుతున్నారు. సైనిక అధికారులమని బోగస్ గుర్తింపు కార్డులు ఓఎల్‌ఎక్స్‌లో ఉంచి... అమాయకులపై వల విసురుతున్నారు. వాహనం నచ్చితే ముందు సగం ధర తాము సూచించిన బ్యాంకు ఖాతా, ఇతర మార్గాల ద్వారా చెల్లించాలని, మిగితా సగం వాహనం ఇచ్చే సమయంలో ఇవ్వాలని పేర్కొంటున్నారు. వారి మాయలో పడి సొమ్ము ఖాతాలో జమ చేశారో... డబ్బులు పోయినట్టే. అయితే అధిక శాతం మంది బాధితులు వీరి మాటలు నమ్మి డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.
వివిధ రూపాల్లో అవగాహన...
సొమ్ము జమ చేసిన తర్వాత ఎంతకీ స్పందన లేకపోవడం వల్ల బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గతేడాది ఓఎల్‌ఎక్స్ పేరిట హైదరాబాద్‌లో 1642, సైబరాబాద్‌లో 1309, రాచకొండలో 887 మంది మోసపోయారు. ఇది కాక ప్రతిరోజూ పదుల సంఖ్యలో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. మరోవైపు పోలీసులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా పలువురికి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. కరపత్రాలు పంచడం, సినిమా థియేటర్లలో ప్రకటనలు, ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్ తెలిపారు. బ్యాంకు అధికారులమంటూ, ఖాతాలు అప్‌డేట్ చేయాలని వివరాలు కోరే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన చెబుతున్నారు.
ఇవీ చూడండి: చెరువులోకి దూసుకెళ్లిన కారు..సర్పంచ్ భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి