నగరంలో తొలుత ఖాళీగా కనిపించిన రహదారి మధ్యాహ్నం కనీసం నడిచేందుకు కూడా వీల్లేకుండా మారిపోతుంది. రోడ్లన్నీ వాహనాలు ఆక్రమించేసుకుంటున్నాయి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెలుపల ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కిక్కిరిసి ఉంటుంది. బస్సులు ఆపేందుకు స్థలమున్నా.. లోపలే ప్రీపెయిడ్ ఆటోలున్నా.. బయట ఆటోలు... బస్సులు అలాగే నిలుపుతున్నారు. చిరువ్యాపారులు రోడ్లపైకి వస్తారు. దీంతో రైల్వేస్టేషన్ నుంచి బయటకు రావాలంటే అక్కడున్న వారందరినీ తోసుకుంటూ రావాల్సిందే..
ప్యారడైజ్... రాణిగంజ్
నిత్యం వాహనాల రద్దీతో ఉండే ప్రధాన రహదారి ప్యారడైజ్-రాణిగంజ్. జేబీఎస్ నుంచి నుంచి ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచే ఆర్టీసీ బస్సులు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఎంజీరోడ్ నుంచి రామ్‌గోపాల్‌పేట్ పాత పోలీస్‌ఠాణా, రాణిగంజ్ వరకు రహదారి ఇరుకుగా ఉండడంతో బస్సులు, కార్లు వెళ్లేందుకు ఇబ్బందే. ఈ మార్గంలో దుకాణదారులు స్థలాన్ని ఆక్రమించడం, గాంధీ విగ్రహం వద్ద కార్లు నిలిపేయడంతో వాహనాలు చీమలబారులా వెళ్లాల్సిందే.
నిర్మించేది.. వారికోసమే
మల్కాజిగిరి, సాయినగర్, సఫిల్‌గూడ చౌరస్తాల్లో ఇప్పటి వరకు ట్రాఫిక్ సిగ్నళ్లు లేవు. రహదారులకు ఇరువైపులా పాదచారుల రక్షణ కోసం కాలిబాటలను ఏర్పాటు చేశారు. ఇవి పాదచారుల కన్నా వ్యాపారులకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. వాహనాల రద్దీ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆనంద్‌బాగ్‌లో ఇద్దరు, మీర్జాలగూడలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
విస్తరించినా అదే సమస్య
పంజాగుట్ట-అమీర్‌పేట రోడ్డుకు రెండువైపులా ఉన్న ప్రైవేటు ఆస్తులకు నష్టపరిహారం చెల్లించి 10అడుగుల మేర విస్తరించారు. అయినా గతంలో ఎలా ఉందో ఇప్పుడూ పరిస్థితి అలాగే ఉందని వాహనదారులు అంటున్నారు. పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ ప్రాంతంలో మార్గం విస్తరించినా దుకాణాదారులు ఆక్రమించుకున్నారు.
- ఖైరతాబాద్ రైల్వేగేట్ నుంచి జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయం వరకూ రహదారిని విస్తరించినా ప్రైవేటు విద్యా,వాణిజ్యసంస్థలు పార్కింగ్ కోసం వినియోగించుకుంటున్నాయి. సర్కిల్ కార్యాలయం వద్ద రహదారి ఇరుకుగా ఉన్నా.. పార్కింగ్ చేస్తున్నారు.
శేరిలింగంపల్లి.. ఊరట లేదు
శేరిలింగంపల్లి పరిధిలోని అన్ని రహదారుల్లో ఉదయం, సాయంత్రం వేళ ట్రాఫిక్ నరకం చూపిస్తుంది. రెండు సంవత్సరాల వ్యవధిలో వేసిన కొన్ని లింక్ రోడ్లు ఈ అవస్థకి ఊరటనివ్వలేదు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు పూర్తిగా ఆక్రమణలతో నిండిపోయింది.
- వివేకానంద్‌నగర్- ఆల్విన్ కాలనీ రోడ్డు, ఉషాముళ్లపూడి రోడ్డు, భాగ్యనగర్ కాలనీ- ఆల్విన్ కాలనీ రోడ్డు, నిజాంపేట రోడ్డు ఇలా జాతీయ రహదారి లింక్ ఉన్న ప్రతి ప్రధాన రోడ్డు ఆక్రమణలతో కుంచించుకుపోయింది.
- షాపూర్‌నగర్ రైతుబజారు వద్ద ఉన్న నర్సాపూర్ ఆర్‌అండ్‌బీ రహదారిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కానీ అక్కడ వ్యాపారాలు నిర్వహించేవారికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపలేదు. వారు రహదారి పక్కనే వ్యాపారం నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్ జామవుతోంది. ఇక్కడ సంభవిస్తున్న రహదారి ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు.
- సూరారంలోని ఓ ప్రజా ప్రతినిధికి చెందిన కార్పొరేట్ ఆసుపత్రి ముందు రహదారి స్థలాన్ని ఆక్రమించి ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా వాహనాల పార్కింగ్ నిర్వహిస్తున్నారు. సంబంధిత ఆసుపత్రికి రోజు వచ్చే సుమారు 500-800 వాహనాలు ఇక్కడే పార్కింగ్ చేయిస్తున్నారు. ఒక్కో వాహనదారుడి నుంచి నిర్వాహకులు రూ.20 చొప్పున పార్కింగ్ రుసుము వసూలు చేసి పెట్టుబడిలేని వ్యాపారం నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: వీడియో తెచ్చిన తంటాలు.. రూ.12 వేలు ఫైన్!
మెట్రోస్టేషన్ వద్ద ట్రాఫిక్‌లో ప్రభుత్వ అధికారికి గుండెపోటు.. పోలీసులేంచేశారంటే
భారీగా ట్రాఫిక్ జామ్.. కి.మీ.ల మేర నిలిచిన వాహనాలు
Traffic Rules News: వాహనం నడుపుతూ ఫోన్లో మాట్లాడుతున్నారా.. ఇక మీరు జైలుకే!
Software Engineer as Traffic volunteer : ట్రాఫిక్ వాలంటీర్‌గా సాఫ్ట్వేర్ ఇంజినీర్