BJP Laxman Comments about GO 317: జీవో 317 పై పోరాటం ఆగదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు భరోసా కల్పించడానికే జాతీయ నేతలు రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ఉద్యోగులను సంప్రదించకుండా నాలుగు గోడల మధ్య జీవోను తీసుకువచ్చారని ఆరోపించారు. జీవో సవరించాలని ఆదివారం వరంగల్‌లో నిరసన చేపడుతున్నామని... ఇందులో అసోం ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం సవరించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.
జీవో 317 నుంచి దృష్టి మళ్లించడానికే భాజపా నేతలను నిర్భందాలకు గురి చేస్తున్నారు. భాజపా నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఆ జీవో సవరించే వరకు ఉద్యమం ఆగదు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు భరోసా కల్పించడానికే జాతీయ నేతలు తెలంగాణకు వస్తున్నారు. 317 జీవో వల్ల 1969లో ఏర్పడిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకువస్తుంది.
-లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
ఎమర్జెన్సీని తలపించే విధంగా కేసీఆర్ పాలన ఉందని లక్ష్మణ్ ఆరోపించారు. భావప్రకటన స్వేచ్ఛను కేసీఆర్ ప్రభుత్వం అణిచివేస్తోందని విమర్శించారు. 317జీవో పైన సీఎం కేసీఆర్కు కనీస అవగాహన లేదని... రానున్న రోజుల్లో తెలంగాణలో తెరాస అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. ఈనెల 11న మహుబూబ్నగర్ జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో... మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ పాల్గొంటారని తెలిపారు.
317జీవో వల్ల ఉద్యోగులు స్థానికతను కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్లు కూడా వేయలేదు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ప్రభుత్వం సవరించకపోతే భాజపా అధికారంలోకి వచ్చాక సవరిస్తాం.
-లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
ఇదీ చదవండి: అప్పులే యమపాశాలై.. దుర్గమ్మ దర్శనానికి వెళ్లి కుటుంబం బలవన్మరణం