Laxman on KTR: ఐటీ, పురపాలకశాఖ మంత్రి తన పేరును తారక రామారావుకు బదులుగా తుపాకీరావుగా మార్చుకోవాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్... నైరాశ్యంతోనే ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారని చురకలంటించారు. తెరాస తాటాకు చప్పుళ్లు, కేసులకు భాజపా కార్యకర్తలు బయపడరని తెలిపారు. నాంపల్లి భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌లపై లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. హామీలను అమలు చేయకుండా నమ్మించి మోసం చేసిందెవరో రాష్ట్ర ప్రజలందరికి తెలుసన్నారు. 57 ఏళ్లకే వృద్దాప్య పింఛన్ ఎప్పుడిస్తారో మంత్రి కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సైనికులను కించపరిచే విధంగా చైనాకు అనుకూలంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెరాసపై వ్యతిరేకతను గమనించే తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాకుండా కేసీఆర్‌ను మార్చాలని ప్రజలు నిర్ణయించారని తెలిపారు.
ఇదీ చదవండి : ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ గుంపులో లేను: జగ్గారెడ్డి