హైదరాబాద్ నుమాయిష్ అంటే దేశవ్యాప్తంగా ఆదరణ ఉందని ఆరోగ్య శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ అన్నారు. జనవరి వచ్చిందంటే హైదరాబాద్ గుర్తు వచ్చేలా నుమాయిష్‌ను తీర్చిదిద్దుతామని ఈటల పేర్కొన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌లతో కలిసి మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.
ఎగ్జిబిషన్ సొసైటీ 18 కళాశాలలు నిర్వహిస్తూ 35 వేల మంది విద్యార్థులను చదివిస్తుందని ఈటల స్పష్టం చేశారు. గతేడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రూ. 3 కోట్లు భద్రత ప్రమాణాలకు ఖర్చు చేసినట్లు తెలిపారు. 25 శాతం ఆదాయం తగ్గుతున్నప్పటీకి భద్రత ప్రమాణాలకే ప్రాధాన్యత కల్పించినట్లు వెల్లడించారు.
ఎగ్జిబిషన్ దృష్ట్యా భద్రతతోపాటు ఫైర్ సేఫ్టీ కూడా కల్పించామని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. హోంశాఖ నుంచి నుమాయిష్‌కు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. ఎగ్జిబిషన్ సొసైటీ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి దేశానికి సేవ చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. నుమాయిష్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్