NTR Health University: విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్నాతకోత్సవాన్ని వాయిదా వేశారు. విశ్వవిద్యాలయం నిధులను ప్రభుత్వ సంస్థకు మళ్లించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యోగులంతా విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టడంతో.. ఈనెల 8న నిర్వహించాల్సిన స్నాతకోత్సవం వాయిదా పడింది.
విశ్వవిద్యాలయానికి సంబంధించిన 2019-20, 2020-21 రెండేళ్ల స్నాతకోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. చాలామంది ప్రముఖులను ఆహ్వానించారు. కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పళని వేలు ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సి ఉంది. రెండేళ్లకు సంబంధించి 500 మందికి పతకాలు అందించాలని నిర్ణయించారు. కానీ.. అనుకోని విధంగా విశ్వవిద్యాలయం నిధుల మళ్లింపు, ఉద్యోగుల ఆందోళనబాటతో మొత్తం పరిస్థితి తారుమారైంది.
రెండేళ్ల తర్వాత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకున్న స్నాతకోత్సవానికి సహకరించాలంటూ ఉద్యోగ ఐకాస నాయకులను రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ కోరారు. ఉద్యోగులను శనివారం చర్చలకు ఆహ్వానించారు. నిధులతో స్నాతకోత్సవాన్ని ముడిపెట్టవద్దని శంకర్ విజ్ఞప్తి చేశారు. కానీ.. ఉద్యోగ ఐకాస నాయకులు అంగీకరించలేదు. నిధుల విషయం తేల్చే వరకు విధులకు హాజరయ్యేది లేదని చెప్పేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సోమవారం నుంచి తమ ఆందోళనను మరింత వేగవంతం చేయనున్నట్టు ఐకాస నాయకులు ప్రకటించారు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నరు కార్యాలయం అనుమతి తీసుకుని స్నాతకోత్సవాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్టు రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.
విశ్వవిద్యాలయం నూతన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలకు సంబంధించిన టెండర్ల గడువు శనివారంతో ముగిసింది. రెండు విశ్వవిద్యాలయంలోని ఉద్యోగ సంఘాలకు చెందిన వాళ్లంతా సంఘటితంగా ఏర్పడి ఆందోళన చేస్తుండడంతో మొత్తం అన్ని పనులు ఆగిపోయాయి. దీంతో టెండరులో పాలొనే గుత్తేదారులు అయోమయంలో పడ్డారు. తాము టెండరును దక్కించుకున్నా.. విశ్వవిద్యాలయం నుంచి డబ్బులు వస్తాయో.. రావో అనే సందేహంలో పడ్డారు. ఇదే విషయాన్ని విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీర్లను కూడా కొంతమంది గుత్తేదారులు అడుగుతున్నారు. నిధులన్నీ ప్రభుత్వానికి మళ్లించడంతో.. ఈసారి టెండర్‌లో పాలొనేందుకు గుత్తేదారులు కూడా ఉత్సాహం చూపించడం లేదు.
ఇదీ చూడండి: Jagtial Farmers protest : ధాన్యం కొనుగోళ్లకై రోడ్డెక్కిన రైతులు