కార్యకర్తలే తెరాస బలమని... సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న తెరాస ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె చర్చించారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేయాలని ఎన్నారైలను ఆమె కోరారు.
తెరాస ఎన్నారై శాఖల్లో కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిపారు. ఇటీవల విదేశాల్లో వివిధ కారణాల వల్ల మరణించిన.. ఎన్నారై తెరాస కార్యకర్తలకు కవిత ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు పల్లా రాజేశ్వర రెడ్డి, సురభి వాణిదేవి గెలుపు ఖాయమన్నారు. పల్లా ఎన్నో ఏండ్లుగా పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవి.. గత 30 ఏండ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్నారని కొనియాడారు.
భాజాపా చేస్తున్న తప్పుడు ప్రచారాలను మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారని...సామాజిక మాధ్యమాల్లో సైతం తెరాస కార్యకర్తలంతా... ప్రతి పక్షాల తప్పుడు ప్రచారాలకు సమాధానం చెప్పాలన్నారు. ఏప్రిల్ 27న జరిగే తెరాస ఆవిర్భావ సమావేశానికి, అవకాశం ఉన్న ఎన్నారైలంతా హాజరు కావాలని కోరారు.
ఇదీ చూడండి : ఐటీఐఆర్ రాకపోవడానికి కారణం తెరాసనే: బండి సంజయ్