ఓడిపోయిన నేతలకు ఉన్నతపదవులు...!
ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న మాజీ మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ తదితరుల పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, జూపల్లి కృష్ణారావులకు కూడా ఉన్నత పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం అప్పట్లోనే తెలిపారు. వీరిలో కొందరికి రాజ్యసభ సభ్యత్వం, మరికొందరికి ఆర్టీసీ ఛైర్మన్ లాంటి పదవులు దక్కే అవకాశం ఉందని కూడా ప్రకటించారు.
రైసస రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా....
పదవుల పంపకం ద్వారా ... పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి మంచి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డిని... రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాలని సీఎం ఇప్పటికే నిర్ణయించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
ఒకట్రెండు రోజుల్లో ఆర్డినెన్స్...!
మూసీ నదీతీరప్రాంత అభివృద్ధి సంస్థ సహా ఇతర కార్పొరేషన్లకు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఛైర్మన్లుగా నియమించే ఆలోచననలో సీఎం ఉన్నారు. వారి నియామకాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం శాసనసభ సమావేశం కానందున ఆర్డినెన్స్ తీసుకురావాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. మొత్తం 28 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకు... లాభదాయక పదవుల అంశం అడ్డురాకుండా చట్టాన్ని తీసుకురానున్నారు. ఆర్డినెన్స్ జారీ కోసం ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఒకటి, రెండు రోజల్లో ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఆ వెంటనే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టవచ్చని అంటున్నారు.
ఇవీ చూడండి: షాద్నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు