ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఎలాంటి చట్టబద్ధత లేకుండా ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టారని పిటిషనర్ వాదించారు. కులం, ఆధార్ వంటి వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి చట్టం, కనీసం కార్యనిర్వాహక ఉత్తర్వులు లేకుండా వివరాలు అడుగుతున్నారని కోర్టుకు వివరించారు. కులం వివరాలను పాఠశాల స్థాయి నుంచి అడుగుతారన్న కోర్టు... అందులో ఇబ్బందేమిటని ప్రశ్నించింది.
ఆ వివరాలను బయటకు ఇవ్వనప్పుడు సమస్య ఏంటని అడిగింది. ఇందుకు వివరణ ఇచ్చిన పిటిషనర్.. సేకరించిన వివరాలు వెబ్‌సైట్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచుతున్నట్టు కోర్టుకు తెలిపారు. కేవలం 15 రోజుల్లో వివరాలు సమర్పించాలని అడుగుతున్నారని పేర్కొన్నారు. ధరణిలో వివరాల నమోదుకు ఎలాంటి గడువు లేదని.. అది నిరంతరం కొనసాగుతోందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ఇచ్చిన వివరణను హైకోర్టు నమోదు చేసింది.
ఇదీ చూడండి: పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉంది: హోంమంత్రి