No Petrol Boards at Petrol Refilling Stations in Hyderabad : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్, డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. హైదరాబాద్ మహానగరంలో ఉన్న 1200కు పైగా పెట్రోల్ బంకులలో నిల్వలు నిండుకున్నాయి. ఉదయం నుంచి ఇంధనం(Petrol) లేక వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ లేదనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు ఎగబడ్డారు. రెండు రోజులపాటు బంకులు మూతపడతాయనే తప్పుడు ప్రచారం సాగడంతో వాహనదారులు క్యూ కట్టారు.
హైదరాబాద్‌లో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు : చాలా బంకులలో ఈ రోజు ఉదయం నుంచి నో స్టాక్ బోర్డు పెట్టారు. అక్కడక్కడా కొన్ని పెట్రోల్ బంకులలో స్టాక్ ఉండటంతో ఆ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని దాదాపు అన్ని బంకులలో పెట్రోల్, డీజిల్ పూర్తిగా అయిపోయింది. దీంతో వాహనదారులు నిరాశతో వెనుదిరిగారు. కొంతమంది వాహనదారులు బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి సమాచారం లేకుండా నోస్టాక్ బోర్డు పెడితే వాహనాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని బంకుల వద్ద వాహనాల రద్దీతో ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాటేదాన్ వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ పెట్రోల్ బంకు వద్ద దాదాదు అర కిలోమీటర్ మేర వాహనాలు క్యూ లైన్‌లో నిలిచిపోయాయి. వాహనాలు ఎక్కువగా ఉన్న పెట్రోల్ బంకు(Petrol Refiling Station) వద్దకు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు చేరుకున్నారు.
పెట్రోల్ బంకుల ముందు బారులు తీరిన జనం - హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
Center Motor Vehicles Act : సోమవారం ఉదయం నుంచి చర్లపల్లిలోని ఐఓసీ, బీపీసీ, హెచ్‌పీ ఆయిల్ కంపెనీల ఎదుట డ్రైవర్లు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే దానికి డ్రైవర్లను కఠినంగా శిక్షించడం తగదని డ్రైవర్లు ఆందోళనకు దిగారు. మోటారు వాహనాల చట్టంలో ఇది వరకు ఉన్న చట్టానికి సవరణ చేస్తూ ప్రమాదం చేసి పారిపోతే 7ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10లక్షల జరిమానా విధించాలనే మార్పులు తీసుకొచ్చారు. దీన్ని నిరసిస్తూ ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగారు.
చర్లపల్లిలోని ఐఓసీ, బీపీసీ, హెచ్‌పి ఆయిల్ కంపెనీల నుంచి రోజు 1500కు పైగా ట్యాంకర్లు నిత్యం ఇంధన సరఫరా చేస్తుంటాయి. రోజు 18వేల కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్ రాష్ట్రంలోని వివిధ కంపెనీలకు సరఫరా అవుతుంది. 31వ తేదీ వరకు సరఫరా యథావిధిగానే జరిగింది. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గొచ్చనే ఉద్దేశంతో కొంతమంది పెట్రోల్ బంకు యజమానులు పూర్తిస్థాయిలో నిల్వలు ఉంచుకోలేదు. కేంద్ర పెట్రోలియం శాఖ నుంచి పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపు ఉండదని హామీ ఇవ్వడంతో బంకు యజమానులు పూర్తిస్థాయిలో ఇంధనాన్ని నింపుకోవడానికి సిద్ధమయ్యారు.
No Petrol in Hyderabad Bunks : ఆ లోపే ట్యాంకర్ల డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. 31వ తేదీ ఆదివారం కావడంతో ఇంధన వినియోగం సాధారణ రోజులతో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటుంది. జనవరి 1వ తేదీ సెలవు దినం కావడంతో వాహనదారులు ఎక్కువగా బయటికి రాకపోవడంతో బంకులకు పెద్దగా గిరాకీ రాలేదు. ఈ రోజు ఉదయం నగరవాసులు యథావిధిగా బయటికి రావడంతో బంకుల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ పూర్తిగా అయిపోయింది. కొన్ని బంకులలో సోమవారం రాత్రి, మరికొన్ని బంకులలో ఈ రోజు ఉదయం 10గంటల వరకే ఇంధన కొరత ఏర్పడింది. నో స్టాక్ బోర్డులు పెట్టారు.
ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకు డ్రైవర్లు : మూడు ఆయిల్ కంపెనీల ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ట్యాంకర్ల డ్రైవర్లకు పోలీసులు నచ్చజెప్పారు. ప్రమాదం జరిగితే సంఘటనాస్థలంలో పరిస్థితులను బట్టి ప్రాణరక్షణ కోసం డ్రైవర్లు పారిపోయినా సమాచారాన్ని వెంటనే పోలీసులకు, వాహన యజమానులకు చెపితే కఠిన శిక్షలుండవని పోలీసులు అవగాహన కల్పించారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆందోళన విరమించారు. ఆ తర్వాత ట్యాంకర్లు కంపెనీల్లోకి వెళ్లి ఇంధనాన్ని నింపుకొని బంకులకు బయల్దేరాయి. రాత్రి 7గంటల తర్వాత బంకులకు చేరుకోవడంతో వాహనదారులకు ఉపశమనం లభించింది. రేపటి వరకు ఇంధన సరఫరా యథావిధిగా మారుతుందని బంకు యజమానులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు.