పన్నులపై పన్నువిధింపు విధానానికి స్వస్తి పలికి... 2017 ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను- జీఎస్టీని కేంద్రం అమలులోకి తెచ్చింది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్ ద్వారా అమలవుతున్న ఈ విధానంలో చిన్నపాటి లోపాలను ఆసరా చేసుకుని కొందరు వ్యాపారులు అక్రమాలకు తెరతీస్తున్నారు.
ఈ వేబిల్లు ఉండాల్సిందే...
దేశవ్యాప్తంగా 1.21 కోట్ల మేర వ్యాపార, వాణిజ్య సంస్థలు జీఎస్టీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోగా ప్రతిరోజూ సగటున 23.58లక్షల మంది రిటర్న్‌లు దాఖలు చేస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే వ్యాపార, వాణిజ్య సంస్థలు రూ.50వేలు అంతకుమించి విలువైన సరుకు పది కిలోమీటర్లు దూరం రవాణా చేయాలన్నా... ఈ వేబిల్లు రవాణా వాహనం వెంట ఉండడం తప్పనిసరి చేశారు. ఈ విధానం 2018 ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
చెక్ పెట్టేందుకే..
2018 అక్టోబరు నుంచి ఆయా సంస్థలు జనరేట్ చేసే వేబిలుల్లో... ట్రాన్స్‌పోర్టర్ గుర్తింపు కార్డు నంబరు, పిన్‌కోడ్ తప్పనిసరి చేసింది. అయితే మొత్తం జీఎస్టీ రిజిస్ట్రేషన్ సంస్థల్లో దాదాపు 70శాతం రిటర్న్‌లు వేయడం లేదని అధికారుల అంచనా. రిటర్న్‌లు దాఖలు చేయని సంస్థలు కూడా ఆన్‌లైన్ ద్వారా రహదారి పత్రాలు పొందుతూ.. తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. కానీ రిటర్న్‌లు దాఖలు చేయడం లేదు. ప్రభుత్వానికి వస్తుసేవల పన్నుచెల్లించడమూ లేదు. దాదాపు 30శాతం వ్యాపార, వాణిజ్య సంస్థలు రిటర్న్‌లు దాఖలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన జీఎస్టీ కౌన్సిల్ సుదీర్ఘంగా చర్చించి... ఆయా సంస్థలకు చెక్ పెట్టే విధానానికి శ్రీకారం చుట్టింది.
ఆటోమేటిక్‌గా ఆగిపోయే విధానం
ఏ సంస్థ అయితే వరుసగా రెండు రిటర్న్‌లు దాఖలు చేయదో.. ఆ సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌పై ఈ వేబిల్లు జనరేట్ కాకుండా ఆటోమేటిక్‌గా ఆగిపోయే విధానాన్ని తీసుకొచ్చింది. జీఎస్టీ పన్ను విధానం అంతా కూడా ఆన్‌లైన్ ద్వారా అమలయ్యేది కావడంతో మానవ సంబంధం లేకుండానే రెండు రిటర్న్‌లు వరుసగా వేయని సంస్థకు రహదారి పత్రం జనరేట్ కావడం ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. దీంతో ఆ సంస్థ నుంచి అమ్మకాలు, కొనుగోళ్లు దాదాపు జరగవు. తిరిగి ఆ సంస్థ రిటర్న్‌లు దాఖలు చేస్తేనే... ఈ వేబిల్లు పొందడం సాధ్యమవుతుంది. ఇలా చేయడం ద్వారా అయినా రిటర్న్‌లు సక్రమంగా దాఖలు చేయని వ్యాపార, వాణిజ్య సంస్థలు దారికొస్తాయని భావించి ఈ నెల ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఈ వేబిల్లుల నిలిపివేత విధానం అమలులోకి తెచ్చింది.
వందశాతం అపరాధ రుసుం విధింపు
ఇతర సంస్థల పేరున ఈ వేబిల్లు తీసుకుని రవాణా సాగించినట్లయితే దానిని తీవ్రంగా పరిగణించి పన్ను విధింపుతోపాటు వందశాతం అపరాధ రుసుం విధిస్తారు. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ అధికారులు... తరుచూ వాహనాలను తనిఖీలు నిర్వహించి అక్రమంగా సరుకు రవాణా చేసే సంస్థల పని పడుతున్నారు.
- కేసీఆర్ సంబంధిత స్పీచ్: ప్రజా జీవితంలో విశ్రాంతి ఉండదు: కేసీఆర్