రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న తరుణంలో వైద్య సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండబోదని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆస్పత్రులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. కరోనా టెస్టులతోపాటు... వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
గ్లోబల్ టెండర్లకు మొగ్గు
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సైతం వేగంగా నిర్వహించాలని భావిస్తున్న సర్కారు... గ్లోబల్ టెండర్లను పిలవాలని కేబినెట్లో నిర్ణయించింది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఆ విధంగానే ముందుకెళ్తున్నాయి. రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం ద్వారా అంతర్జాతీయ టీకా తయారీదారుల నుంచి వ్యాక్సిన్లను సేకరించటం సులభమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు లక్షణాలు ఉన్నవారిని ఫీవర్ సర్వే ద్వారా ఇప్పటికే గుర్తించి ఇంటి వద్దే మందులు ఇస్తున్న తరుణంలో కొవిడ్ లక్షణాలతో టెస్టింగ్ కేంద్రాలకు వచ్చే వారిని ఆపే అవకాశం లేదని తెలుస్తోంది.