రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌కు చెందిన వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. క్షణక్షణం పరిస్థితి విషమిస్తుండటంతో ఆయన భార్య మంగళవారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 3 వరకు నగరంలోని ఆరు ప్రైవేటు ఆసుపత్రులకు తిరిగారు. అన్నిచోట్లా నిరాకరించారు. బంజారాహిల్స్‌లో ఉండే ఓ ఆసుపత్రి చికిత్స ఇవ్వం గానీ, రోగికి కేవలం ఆక్సిజన్ అందిస్తామని..రూ.2లక్షలు డిపాజిట్ చేయాలని స్పష్టంచేశారు. చేతిలో చిల్లిగవ్వ లేని ఆమె ఉస్మానియాకు తీసుకువెళితే కరోనా నిర్ధారణ పత్రం లేదు కాబట్టి చేర్చుకోవడానికి నిరాకరించారు. చివరికి గాంధీ ఆసుపత్రికి వెళ్తే అక్కడా అదే ప్రశ్న. తన భర్త ప్రాణాలను రక్షించాలంటూ అక్కడి వైద్యుల కాళ్ల మీద పడి ఆమె కన్నీటితో వేడుకుంది. వారు మానవీయ కోణంలో స్పందించి వెంటనే చేర్చుకొని చికిత్స అందించారు.
సిద్దిపేటకు చెందిన ఓ పాత్రికేయుడు కరోనాతో ఊపిరాడక నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడానికి బుధవారం విశ్వప్రయత్నాలు చేశారు. అయినా తన వల్ల కాకపోవడం, ఆరోగ్యం విషమించడంతో సెల్ఫీ వీడియో ద్వారా పరిస్థితిని రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకు వివరించారు. మంత్రి స్పందిస్తే గానీ ప్రైవేటు ఆస్పత్రిలో పడక లభించలేదు.
కొన్ని అందుబాటులో ఉంచితే..
రాజధాని పరిధిలో దాదాపు 25 పెద్ద ఆసుపత్రులు 2500 పడకలను ఏర్పాటుచేసి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాయి. గత కొంతకాలంగా రోగుల సంఖ్య పెరగగా ప్రైవేటులో కూడా పడకలు దొరకడం గగనంగా మారింది. కొన్ని ఆసుపత్రులు తమ దగ్గర అందుబాటులో ఉన్న పడకలను బ్లాక్ చేయడం వల్ల సమస్య ఉత్పన్నమవుతోంది. చివరకు మంత్రులు, ఇతర వీవీఐపీలు చెప్పిన తర్వాత రోగులను కొన్ని ఆసుపత్రులు చేర్చుకుంటున్నాయి. ఇలా పలుకుబడితో చేరేవారి సంఖ్య సైతం అధికంగానే ఉంది. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారిని చేర్చుకోవడానికి అనుగుణంగా అన్ని ఆసుపత్రుల్లో కొన్ని పడకలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. చాలా ఆసుపత్రులు అత్యవసర స్థితిలో తమ దగ్గరకు వచ్చే కరోనా రోగులను చేర్చుకోవడంలేదు. గత పది రోజులుగా పదిమందికి పైగా సకాలంలో వైద్యమందక ఊపిరి వదిలారు.
రాత్రీపగలు తేడాలేకుండా కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు సేవలు అందిస్తున్నాయి. ఉన్న 2500 పడకల్లో రోగులు ఉన్నారు. అటువంటప్పుడు కొత్తగా వచ్చేవారిని చేర్చుకుని వైద్యం అందించలేని పరిస్థితి. రోగం నయమైనవారు డిశ్ఛార్జి అయిన వెంటనే మరో రోగిని చేర్చుకుంటున్నార. కొంతమంది కావాలనే ఆసుపతుల్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
డాక్టర్ బి.భాస్కర్‌రావు, ప్రైవేటు ఆసుపతుల్ర సంఘం అధ్యక్షుడు
ఆఖరి క్షణంలో...
రోగులు కూడా కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారం రోజులుగా జ్వరం ఉన్నా పరీక్షలు చేయించుకోవడం లేదు. అప్పటికే వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తోంది. అయినా స్పందించకపోతే నిమోనియా వృద్ధి చెంది చనిపోతున్న పరిస్థితి. బుద్వేల్‌కు చెందిన రోగి విషయానికే వస్తే ఏడురోజులుగా జ్వరం ఉన్నా స్థానికంగా ఉన్న వైద్యునికి చూపించి సాధారణ మందులను వాడుతున్నారు. కరోనా చికిత్స మొదలుకాక పరిస్థితి సీరియస్‌గా మారింది. చావు బతుకుల మధ్య తమ దగ్గరకు వచ్చే రోగులను కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వెంటనే చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయి. 'మీరు కరోనా పరీక్ష చేయించుకున్నారా? నిర్ధారణ సర్టిఫికెట్ చూపించండి.. అప్పుడే చేర్చుకుంటాం' అని తెగేసి చెబుతున్నాయి.