బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నోడల్ కేంద్రమైన కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో 200 పడకలు కేటాయించారు. మరికొన్ని అదనపు పడకలు వేయడంతో ఇప్పటికే 218 మంది ఇందులో చేరారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిలో 31 మందిని సోమవారం ఒక్కరోజే చేర్చుకున్నారు. పడకలు అందుబాటులో లేకపోవడంతో పలువురు వెనుతిరిగారు. వ్యాధి తగ్గడంతో ఆరుగురిని డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలోనూ వారం రోజుల నుంచి బ్లాక్ ఫంగస్ రోగుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం వంద మందికి పైగా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. నగరంలోని ఇతర ప్రైవేటు ఈఎన్‌టీ ఆసుపత్రుల్లో కూడా చేరుతున్నారు. ఖరీదైన చికిత్స కావడంతో మధ్యతరగతి ప్రజలు, పేదలు ప్రభుత్వ దవాఖానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఫంగస్‌కు అవసరమయ్యే లైపోసోమల్ యాంఫోటెరిసిన్-బి, ఫొసకానజోల్, డీఆక్సీ కొలైట్ తదితర ఇంజక్షన్లకు కొరత నెలకొంటోంది. ప్రస్తుతం వీటిని ఈఎన్‌టీ ఆసుపత్రులోనే అందిస్తున్నారు. ప్రైవేటులో చికిత్స తీసుకునే వారికి వైద్య ఆరోగ్య శాఖ అనుమతితో జారీ చేస్తున్నారు. ఇందుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. చాలామంది ప్రైవేటులో సర్జరీ చేయించుకొని ఇంజక్షన్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో మందుల కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రోగులు నగరబాట పడుతుండటంతో రద్దీ నెలకొంటోంది.
వెనక్కి వెళ్లి రాలేక..!
ఈఎన్‌టీ ఆసుపత్రిలో పడకల ఖాళీ లేకపోవడంతో అత్యవసరం లేని వారికి మందులు రాసి ఇచ్చి పంపుతున్నారు. వారి పూర్తి వివరాలు సేకరించి, ఫోన్ చేసి పిలుస్తామని చెప్పి పంపించేస్తున్నారు. నగరం, శివారు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్తున్నా... దూరప్రాంతాల నుంచి వచ్చిన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. లాక్‌డౌన్‌కుతోడు, ఆర్ధిక పరిస్థితులతో తిరిగి వెళ్లలేక అక్కడే ఉంటూ వైద్యులను వేడుకుంటున్నారు. గత సోమవారం దవడ వాపుతో బాధ పడుతున్న నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం రాజీవ్‌నగర్ తండాకు చెందిన లలితాబాయి(30) ఈ ఆసుపత్రికి వచ్చింది. ఓపీలో పరిశీలించిన వైద్యులు పరీక్షలు చేయించారు. నివేదికలు తీసుకుని వైద్యుల సూచన మేరకు సోమవారం ఆసుపత్రి రాగా పడకలు ఖాళీ లేవని, మందులు వాడమని చెప్పి పంపారు.
ఎక్కడికక్కడే చికిత్సకు యోచన
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే దిశగా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల బాధితులు హైదరాబాద్‌కు వస్తుండటంతో కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో పడకలకు ఇబ్బంది తప్పడం లేదు. చేసేది లేక ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర వైద్య కళాశాల్లోని అనుబంధ ఈఎన్‌టీ విభాగాల్లో బాధితులకు వైద్యం అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.దీనిపై ఇంకా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తొలి దశలో గుర్తిస్తే ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా ఔషధాలతో తగ్గించే వీలు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం క్లిష్టంగా మారిన రోగులతోపాటు శస్త్ర చికిత్సలు అవసరమని భావించే వారికి మాత్రం హైదరాబాద్ ఈఎన్‌టీ లేదా గాంధీకి తరలించనున్నారు. మరోవైపు ఈఎన్‌టీ ఆసుపత్రిని మౌలిక వసతుల కొరత, సిబ్బంది కొరత వేధిస్తోంది. 50 మంది నర్సింగ్ సిబ్బందిని డిప్యుటేషన్‌పై రప్పించారు. సీటీ స్కాన్ అందుబాటులో లేక ఉస్మానియా ఆస్పత్రికి పంపుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్