దిల్లీలో ప్రార్థనలకు హాజరై తిరిగి నగరానికి వచ్చిన వారందరినీ ఆసుపత్రులు, క్వారంటైన్లకు తరలించిన పోలీసులు ఇంకా ఆ ఆనవాళ్లేమైనా ఉన్నాయా అన్న కోణంలో కంటెయిన్‌మెంట్ జోన్లు.. పరిసర ప్రాంతాల్లో సర్వే చేపడుతున్నారు. ఒకటికి, రెండుసార్లు కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీ, పశ్చిమమండలంలో 270 పాజిటివ్ కేసులుండడం వల్ల ఈ రెండు మండలాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించారు.
బహిర్గతమవుతోందిలా....
దిల్లీలో జరిగిన ప్రార్థనలకు నగరం నుంచి 400మంది వరకూ హాజరయ్యారని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి. ఈ గణాంకాల ఆధారంగా నగర పోలీసులు స్పందించి వారందరినీ 24 గంటల వ్యవధిలో ప్రభుత్వ క్వారంటైన్లకు తరలించారు. ప్రార్థనలకు హాజరై నగరానికి వచ్చిన వారిలో 64 మంది విదేశీయులున్నారు. వీరిలో ముగ్గురికి కరోనా సోకింది. మిగిలిన వారిలో 323 మందికి నిర్ధరణ అయ్యింది. వారి సన్నిహితుల జాబితాను సేకరించిన పోలీసు ప్రత్యేక బృందాలు సుమారు 800 మందిని క్వారంటైన్లకు తరలించారు. వీరిలో కొందరికి నెగటివ్ రాగా... మరికొందరి ఫలితాలు రావాల్సింది.
ఇంకా ఎవరైనా ఉన్నారా?
దిల్లీలో ప్రార్థనలకు హాజరైన వారిలో 99శాతం మందిని పోలీసులు, ప్రత్యేక బృందాలు ఆసుపత్రులకు తరలించాయి. వీరిలో 30శాతం మంది చికిత్స పొంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. డిశ్ఛార్జి అయిన వారితో పోలీస్ ప్రత్యేక బృందాలు మాట్లాడి దిల్లీ నుంచి వచ్చాక మీరు ఇంకా ఎవరినైనా కలిశారా? అని వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు సేకరించి ఆయా ప్రాంతాలకు వెళ్లి అనుమానితులను ఆసుపత్రులకు తరలించి కొవిడ్-19 పరీక్షలు చేయిస్తున్నారు.