India's Largest Hospital in Hyderabad : హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి భవంతి నిర్మాణానికి వేదిక కానుంది. నిమ్స్‌కు అనుబంధంగా.. అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇరవై ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. ఎర్రమంజిల్‌లోని ప్రభుత్వ ప్రాంగణంలో దీన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టిమ్స్ పేరుతో రూ.2,100 కోట్ల వ్యయంతో అల్వాల్, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లో భారీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టింది.
NIMS Expansion : ఈ క్రమంలోనే నిమ్స్‌ను కూడా భారీగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాంగణంలో అవకాశం లేకపోవటంతో నిమ్స్‌కు సమీపంలోని కాలం చెల్లిన ప్రభుత్వ క్వార్టర్ల స్థానంలో.. ఈ ఆసుపత్రి నిర్మాణానికి రహదారులు, భవనాల శాఖ ప్రణాళిక రూపొందించింది. ఆయా క్వార్టర్లను స్వాధీనం చేసుకుని వాటిని కూల్చి వేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 14న ఆ భవన సముదాయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసేందుకు వీలుగా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు.
34 విభాగాలు.. 2,100 పడకలు : వైద్య రంగానికి చెందిన 34 రకాల ప్రత్యేక విభాగాలు.. నూతన ప్రాంగణంలో ఏర్పాటు చేసేవిధంగా నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే 2,100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దనున్నారు. రూ.1,570 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. నిమ్స్ ప్రస్తుతం 22 ఎకరాల విస్తీర్ణంలో.. 1,300 పడకలతో ఉంది. మరోవైపు గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్న నాటి నుంచి.. 36 నెలల్లో ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నది అధికారుల లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదే పెద్దది ఎలాగంటే : నిమ్స్‌కు అనుబంధంగా నిర్మించే ఆసుపత్రి భవనమే.. దేశంలో అతిపెద్ద ఆసుపత్రి భవంతిగా రికార్డుల్లో నమోదవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేశంలోని ఎయిమ్స్‌తోపాటు.. ఇతర ప్రభుత్వ ఆసుపత్రులను పరిగణనలోకి తీసుకున్నా.. ఇదే పెద్ద భవనం అవుతుందని తెలిపారు. వేర్వేరు భవనాలతో భారీ విస్తీర్ణంలో ఆసుపత్రులు ఉన్నప్పటికి.. 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే భవనం దేశంలో ఎక్కడా లేదని ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రి భవన నిర్మాణం కోసం.. 32 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో కొంత భూమి ఆసుపత్రి నిర్మాణానికి అనుకూలంగా లేదని అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే కేటాయించిన దానిలో తిరిగి 3 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు. మరికొంత ప్రభుత్వ భూమిలో రహదారులు ఉన్నాయి. నిర్మాణానికి అనువుగా 26 ఎకరాలున్నట్లు నిర్ధారించారు. ఈ విస్తీర్ణంలో భవన సముదాయానికి, పచ్చదనానికి, పార్కింగ్‌కు, వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.
NMC Approval for Karimnagar Government Medical College : కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి అనుమతులు ఇచ్చింది. వంద సీట్లతో కళాశాలకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రారంభించనున్న.. 9 వైద్య కళాశాలలకూ పూర్తిస్థాయి అనుమతులు వచ్చినట్లయింది. వాటిలో జనగామ, సిరిసిల్ల, నిర్మల్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో మొత్తం 100 సీట్లతో.. 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి రావడంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా కొత్తగా 21 కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: