పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కొత్తగా 375 జంబో బ్యాలెట్ బాక్సులను తయారు చేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో జంబో బ్యాలెట్ బాక్సులు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2010 ఉపఎన్నికల సమయంలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసిన.. ఐదు నియోజకవర్గాల కోసం తయారు చేసిన జంబో బాక్సుల్లో 1,310 వినియోగానికి అనువుగా ఉన్నట్లు గుర్తించారు.
ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,530 పోలింగ్ కేంద్రాలున్నాయి. పది శాతం అదనంగా కలిపి 1,685 బాక్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న 1,310 పోగా... మిగతా 375 జంబో బ్యాలెట్ బాక్సులను తయారు చేయిస్తున్నారు. ఈ నెల పదో తేదీలోగా వాటిని సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది ఓటర్ల లోపే ఉన్న నేపథ్యంలో ఒక్కో కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్సు సరిపోతుందని అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా జంబో బ్యాలెట్ బాక్సులకు అదనంగా పెద్ద సైజులో ఉండే బ్యాలెట్ బాక్సులను కూడా ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒకటి లేదా రెండు పంపాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి : 'ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో తప్పులున్నాయ్'