New Year Celebrations in Telangana : కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి. హైదరాబాద్ పాతబస్తీ చార్మినర్ వద్ద శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఆదర్శ్‌నగర్‌లోని బిర్లా మందిర్‌కు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
పంజాగుట్టలోని సాయిబాబా ఆలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు భక్తులతో కలిసి కేక్ కట్ చేశారు. మాసబ్‌ట్యాంక్ వద్ద పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో నిర్వహించిన వేడుకలకు డీజీపీ అంజనీకుమార్ హాజరయ్యారు. గుడిమల్కాపూర్‌లోని వీరభద్రస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరభద్ర స్వామి ఆలయం వద్ద దివ్యాంగులకు వీల్‌ఛైర్స్, బెడ్‌షీట్స్, విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, వృద్ధులకు కర్రలు అందజేశారు.
ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు..: యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్‌లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో కొండపైన బస్ బే, కల్యాణ కట్ట, పుష్కరిణి, ఆలయ ఘాట్‌రోడ్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఘనంగా తెప్పోత్సవం..: భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరంతో పాటు.. ముక్కోటి ఏకదాశి ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం గోదావరి నదిలో తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఓరుగల్లు వాసుల ఇలువేల్పు దైవం శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాగంణంలో సందడి వాతావరణం నెలకొంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి పద్మస్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. అనంతగిరి అటవీ ప్రాంత పరిసరాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో శ్రీరాధా గోవర్ధనదారి ఇస్కాన్ ఆలయంలో ధనుర్మాస వేడుకలు వైభవంగా జరిగాయి. హనుమకొండలోని పలు ప్రాంతాల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. మహిళలు వేసిన రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. వేకువజాము నుంచే అందమైన ముగ్గులు వేయడంలో మునిగిపోయారు. పరకాల పట్టాణానికి చెందిన ఎల్లంకి శోభారాణి తన స్నేహిలతో కలిసి చరిత్రను వివరించే విధంగా వేసిన ముగ్గులు కనువిందు చేశాయి.
ఇవీ చదవండి: 'నుమాయిష్' ప్రారంభం.. కొలువుదీరిన 2 వేలకు పైగా స్టాళ్లు
పెద్దనోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంలో 58 పిటిషన్లు.. సోమవారమే తీర్పు