Telangana New Secretariat video : కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని అధికారులు, ఇంజనీర్లను సీఎం ఇప్పటికే ఆదేశించారు. ప్రధాన పనులన్నీ పూర్తి కాగా సచివాలయ భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఫర్నీచర్, పెయింటింగ్, ల్యాండ్ స్కేపింగ్, ఎలివేషన్, నెట్ వర్కింగ్ తదితర పనులు వేగంగా సాగుతున్నాయి.
సచివాలయ నమూనాకు సంబంధించి ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని ఓ వీడియోను విడుదల చేశారు. కొత్త సచివాలయ భవనం, భవనంలోని ఛాంబర్లు, సమావేశ మందిరాలు, ప్రవేశ ద్వారాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్లు, భవనం చుట్టూ నలువైపులా విశాలమైన రహదార్లు, కాంప్లెక్స్, గుడి, చర్చ, మసీదులు తదితరాల నమూనాను ఇందులో స్పష్టంగా చూపారు.
Telangana New Secretariat Inauguration: నూతన సచివాలయం ఆరో అంతస్తులో కేసీఆర్ క్యాబిన్ ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆయన గదికి సంబంధించి పూర్తి స్థాయిలో తుది మెరుగులు దిద్దుతున్నారు. తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. ఆరు అంతస్తుల మేర హుస్సేన్‌సాగర్ సమీపాన నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు పనికొచ్చే విధంగా పటిష్ఠంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్ బిల్డింగ్ పద్ధతిలో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వచ్చే నెల 5లోగా అంబేడ్కర్ విగ్రహం సిద్ధం కావాలి.. 'వచ్చే నెల 5 లోగా అంబేడ్కర్ విగ్రహ నిర్మాణపనులు పూర్తిచేయాలి. 14న అట్టహాసంగా ప్రారంభోత్సవం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అన్ని పనులు వేగంగా పూర్తి చేయాలి’ అని తెలంగాణ రహదారుల, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు, గుత్తేదారు ప్రతినిధులకు ఆదేశించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సమీపంలో 125 అడుగుల ఎత్తున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నారు . ఈ పనులను మంత్రి సోమవారం రోజున పరిశీలించారు.
నిర్మాణ తీరుతెన్నులపై అధికారులు, గుత్తేదారు ప్రతినిధులతో మంత్రి వేముల సమీక్షించారు. ‘తెలంగాణ రాష్ట్ర కీర్తీ గౌరవం పెరిగెలా ప్రాంగణాన్ని రూపొందించాలి. నిర్మాణ పనులు వేగం పెరగాలి. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. రోజు వారీగా పనులను సమీక్షిస్తామ’ని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి వెంట ఆర్ అండ్ బి ఇంజినీర్-ఇన్-చీఫ్ ఐ.గణపతిరెడ్డి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, గుత్తేదారు ప్రతినిధులు అనిల్ కొండల్‌రెడ్డి అధికారులు హఫీజుద్దీన్, లింగారెడ్డి, రవీంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: