Birth and death certificates: రాష్ట్రంలో 141 పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో.. నమోదు చేసిన వెంటనే జనన, మరణ ధ్రువపత్రాలను పొందే విధానం అమల్లోకి తీసుకువచ్చినట్లు ఆ శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తెలిపారు. పురపాలక కార్యాలయాలకు వెళ్లకుండానే ఈ ధ్రువపత్రాలను పొందవచ్చని మంగళవారం తెలిపారు. జనన, మరణ ధ్రువపత్రాల్లో తక్షణ(ఇన్‌స్టెంట్) రిజిస్ట్రేషన్, తక్షణ అనుమతి, తక్షణ డౌన్‌లోడ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. జనన ధ్రువపత్రాల కోసం పట్టణాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఇచ్చామన్నారు. ఆసుపత్రిలో జన్మించిన శిశువు వివరాలను నమోదు చేసిన వెంటనే తల్లిదండ్రుల ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుందని.. అందులోని లింక్ ద్వారా జనన ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మరణ ధ్రువీకరణలకు ఆసుపత్రులతో పాటు శ్మశాన వాటికల నిర్వాహకులకు ప్రత్యేకంగా యూజర్ ఐడీలు ఇచ్చినట్లు డైరెక్టర్ తెలిపారు. ఆసుపత్రుల్లో మరణించిన వారి వివరాలను వాటి యాజమాన్యాలు నమోదు చేస్తాయని పేర్కొన్నారు. ఇళ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాల్లో సహజ మరణం పొందినవారి వివరాలను శ్మశానవాటిక నిర్వాహకులు మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ వెంటనే సంబంధిత కుటుంబ సభ్యుల ఫోన్‌కు మరణ ధ్రువపత్రం లింక్ వస్తుందని, దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని సర్టిఫికెట్ పొందవచ్చన్నారు. పట్టణ ప్రాంతాల్లో గత నెల 23 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానంలో జనన, మరణ ధ్రువపత్రాలను 24 గంటల్లోనే అందజేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి :