కొవిడ్ దుష్ఫలితాలు చాలామందిలో ఊపిరితిత్తులపై పడుతుండగా.. కొందరిలో మాత్రం మెదడు, నాడీ వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తున్నాయి.. ముఖ్యంగా కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందినవారిలో సుమారు 5 శాతం మంది బాధితులు ఏదో ఒక న్యూరాలజీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వైద్యనిపుణులు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే కొందరిలో మెదడువాపు(ఎన్‌కెఫలోపతి), పక్షవాతం వంటి ప్రమాదకరమైన జబ్బులు దాడి చేస్తుండగా.. ఎక్కువ మందిలో మాత్రం తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం వంటి సమస్యలు దీర్ఘకాలం వేధిస్తున్నాయి. ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికెళ్లాక కూడా.. ఈ తరహా సమస్యలకు గురవుతుండడం బాధితుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
ఎందుకీ సమస్యలు?
కరోనా వైరస్ ప్రభావం అన్ని అవయవాలపై పడుతున్నట్లే.. మెదడు, నాడీ వ్యవస్థపైనా పడుతోంది. అయితే దాని తీవ్రతను బట్టి ఆయా అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఉదాహరణకు కొవిడ్ చికిత్స పొందుతున్న వారిలో మెదడువాపు రావడానికి కేవలం మెదడుపై వైరస్ ఇన్‌ఫెక్షనే కారణం కాకపోవచ్చు. ఊపిరితిత్తులు, రక్తప్రసరణ వ్యవస్థపై చూపించిన దుష్ప్రభావం కారణం కావచ్చు, లేదా వైరస్ కారణంగా మూత్రపిండాలు బలహీనపడితే కూడా మెదడువాపు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు రక్తనాళాల్లో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి పక్షవాతానికి గురవుతున్నారు. అయితే కొవిడ్ బాధితుల్లో పక్షవాతం బారినపడినవారు 1 శాతం మంది ఉంటారని నిపుణుల అంచనా. డిశ్చార్జి అయిన తర్వాత పక్షవాతం బారినపడిన రోగులు కూడా ఉన్నారు. అందుకే డిశ్చార్జి అయ్యేముందు ఎలాంటి సమస్యలు రాకుండా సంబంధిత ఔషధాలను తప్పనిసరిగా చికిత్సలో భాగంగా సూచిస్తున్నారు. మరో 5-10 శాతం మందిలో తలనొప్పి వేధిస్తుంటుంది. మెదడులో ఇన్‌ఫెక్షన్ వల్ల కావచ్చు లేదా రక్తంలో ఆక్సిజన్ శాతం హెచ్చుతగ్గులు జరిగినప్పుడు కావచ్చు. ఎక్కువ మందిలో తొలి 7-10 రోజుల్లో తలనొప్పి వేధిస్తోంది. కొందరిలో 4-6 వారాలు కూడా బాధిస్తుంటుంది.
సాధారణ న్యూరాలజీ సమస్యలు
- తలనొప్పి - ఒళ్లునొప్పులు
- కళ్లు తిరగడం
- రుచిని గుర్తించలేకపోవడం
- వాసనను గ్రహించలేకపోవడం
- ప్రమాదకర న్యూరాలజీ జబ్బులు
- మెదడువాపు
- పక్షవాతం
- మెదడులో రక్తస్రావం
- గులియన్ బారీ సిండ్రోమ్
- నోటికి, కంటికి అనుసంధానంగా ఉండే నరాలు బలహీనమవడం
ప్రమాదకర లక్షణాలు
- ఉన్నట్టుండి నీరసించిపోవడం
- మాటకు మాటకు మధ్య పొంతన లేకుండా అసంబద్ధంగా మాట్లాడడం
- అసహనానికి లోనుకావడం
- కాలు, చేయి బలహీనపడడం
- అపస్మారక స్థితికి చేరుకోవడం
- రక్తంలో ఆక్సిజన్ శాతం 90-94 కంటే తగ్గడం
- ఇటువంటివి కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందాలి.
సరైన సమయంలో చికిత్స ముఖ్యం
కొవిడ్‌కు ఇచ్చే మందులతో వచ్చే దుష్ఫలితాల వల్ల.. ఆక్సిజన్ తక్కువైన సందర్భాల్లోనూ కొందరు రోగులు అసంబద్ధంగా మాట్లాడుతుంటారు. ఆసుపత్రిలో చికిత్స సమయంలోనే కాదు.. ఇంటికెళ్లాక కూడా ఈ తరహా సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా మద్యం, మత్తుమందులకు బానిసైన వారు.. కొవిడ్ చికిత్సలో భాగంగా దీర్ఘకాలం వాటికి దూరమవ్వాల్సి వస్తుంది. ఇటువంటప్పుడు కూడా ఈ తరహాలో ప్రవర్తిస్తుంటారు. వీరిని జాగ్రత్తగా గమనిస్తూ చికిత్స అందించాల్సి ఉంటుంది. సాధారణ సమస్యలు కొద్దిరోజుల్లోనే తగ్గుముఖం పడతాయి. అయితే లక్షణాలు తీవ్రమైతే అత్యవసరంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాలి. సరైన సమయంలో చికిత్స పొందడం చాలా ముఖ్యం. -డాక్టర్ జయదీప్‌రాయ్ చౌదరి, సీనియర్ న్యూరాలజిస్ట్
ఇదీ చదవండి: దుబ్బాక విజయంతో కమలం నేతల్లో కొత్తజోష్