108 VARIETY DISHES to SON IN LAW: సహజంగా కొత్త అల్లుడు ఇంటికి వస్తే.. అత్తగారు చేసే హడావుడి అంతా ఇంత కాదు. రకరకాల వంటలు వండి అల్లుడిని ఎలా మెప్పించాలా అని తర్జన భర్జన పడతారు. కూతురిని అడిగి అల్లుడు ఇష్టంగా తినే వాటిని తెలుసుకుని మరీ వండుతారు. ఇక్కడ ఓ దంపతులు కూడా తమ అల్లుడికి వెరైటీగా కలకాలం గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు. ఇంకేముంది నాన్‌వెజ్ వంటకాలతో కళ్లు చెదిరేలా విందు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మర్యాదలకు పెట్టింది పేరు గోదారోళ్లు.. అందులోనూ అల్లుడికిచ్చే మర్యాదంటే మాములుగా ఉండదండోయ్...!. వివిధ రకాల వంటకాలతో కడుపు నింపేస్తారు. కానీ ఈసారి ఆ పని నెల్లూరు జిల్లా వాళ్ల వంతైంది. కొత్త అల్లుడికి.. కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు అత్తింటివారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి 108 రకాల వంటకాలు వడ్డించారు. కొత్తగా వచ్చిన అల్లుడు అత్తింటివారి మర్యాదలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
పొదలకూరు మండలం ఊసపల్లి గ్రామానికి చెందిన ఊసా శివకుమార్, శ్రీదేవమ్మ.. తన కుమార్తె శివాని, అల్లుడు ఉమ్మడిశెట్టి శివకుమార్‌కు ఊహించని విందునిచ్చి ఆశ్చర్యపరిచారు. మామ శివకుమార్ కండలేరు పోలీస్ స్టేషన్లో హోంగార్డు. అల్లుడు మొదటిసారి ఇంటికి రావడంతో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయాలని భావించి.. పొదలకూరులోని తాజ్ బిర్యాని హోటల్‌లో 108 రకాల వంటకాలు అర్డర్ ఇచ్చారు. చికెన్, మటన్, రొయ్యలు, చేపలు సహా రకరకాల వంటకాలు సిద్ధం చేయించారు.
సిద్ధం చేయించిన వంటకాలను.. ఇంటి దగ్గర డైనింగ్ టేబుల్ పరిచి అరిటాకులో కొసరి కొసరి కూతురు, అల్లుడికి వడ్డించారు. ఒక్కసారిగా అన్ని రకాల వంటకాలు చూసిన అల్లుడు.. అత్తమామల ప్రేమకు పులకరించిపోయాడు. తనకోసం ప్రేమతో చేయించిన వంటకాలన్నీ రుచి చూశాడు. అయితే అల్లుడికి ప్రేమతో వడ్డించిన వంటకాలు చూసిన కొందరు యువకులు మాకు కూడా ఇలాంటి మామ వస్తే ఎంత బాగుంటుందో అని సరదాగా చర్చించుకుంటున్నారు. ఈ వినూత్న ఆచారం చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇవీ చదవండి: జగమంత కుటుంబం 'జునాబాయి'ది.. తడోబాను ఏలుతున్న ఆడపులి
పార్లమెంట్లో అదానీ- హిండెన్ బర్గ్ నివేదిక రచ్చ.. CJI పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలన్న ఖర్గే