భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పాజిటివ్‌గా తేలినా లక్షణాలు లేని బాధితులు ఇంటివద్దే ఐసొలేషన్‌లో ఉండొచ్చని సూచించిన నేపథ్యంలో ఎక్కువ మంది ఇళ్ల వద్ద ఉండి వైద్య సహాయం పొందుతున్నారు. ఇలాంటి వారికి సమీప గృహాల వారు బాధితులకు సహకరించేందుకు ముందుకు వస్తున్నారు. నిత్యావసరాలు, కిరాణా సరకులు, మాస్కులు, ఆహారం అందిస్తున్నారు. కరోనా అంటే భయపడే పరిస్థితి పోయి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ అంటుకోదనే అభిప్రాయం పెరుగుతోందనడానికి ఈ పరిణామం నిదర్శనం.
- ఎర్రగడ్డ ప్రాంతంలో ఓ ఇంట్లో ఇద్దరికి లక్షణాలు లేకుండానే వైరస్ నిర్ధారణ అయ్యింది. ఐదుగురు ఉండే ఆ ఇంట్లో ఓ పడక గదిలో బాధితులు ఐసొలేషన్‌లో ఉంటున్నారు. వారికి కావాల్సిన అవసరాలను కుటుంబ సభ్యులు తీర్చుతున్నారు. చుట్టుపక్కల ఉండే నివాస గృహాల వారు ఆ కుటుంబ సభ్యులు వీధిలోకి రావలసిన అవసరం లేకుండా సహకరిస్తున్నారు. వారికి ఏం కావాలన్నా ఫోన్ చేస్తే చాలు వారి ఇంటి గేటు వద్ద ఉంచుతున్నారు. కొందరు పౌష్టికాహారం తయారు చేసి పాలిథిన్ పొట్లాలతో సరఫరా చేస్తున్నారు.
- ఖైరతాబాద్‌లో ముగ్గురు సభ్యులున్న ఓ కుటుంబంలోని ఇంటిపెద్దకు వైరస్ వచ్చింది. రోజువారీ అవసరాలకు మిగిలిన ఇద్దరూ బయటికి రాకుండా చుట్టుపక్కల వారు సాధ్యమైనంత వరకు సహకరిస్తున్నారు. కూరగాయలు, కోడికూర, గుడ్లు అందజేస్తున్నారు. ఆ గల్లీలోని వారంతా మాస్కులు ధరిస్తూ ఆ కుటుంబం నుంచి ఫోన్ వస్తే చాలు... సాయమందించడానికి సిద్ధంగా ఉంటున్నారు.
- కరోనా బారిన పడి ఓ మారుమూల ప్రాంతం నుంచి నగరానికి వచ్చి అద్దె ఇళ్లు తీసుకుని ప్రైవేటు వైద్యుల ద్వారా చికిత్స పొందుతున్న బాధితులకు నగరంలోని కొందరు పౌష్టికాహారం అందిస్తూ ఆదుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో అద్దెకుంటున్న 15 మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం గుడ్డుతో ఆహారం, రసం; రాత్రికి సి విటమిన్ ఉండే కూరగాయలతో ఆహారం అందించి పెద్ద మనసు చాటుతున్నారు.
- వైరస్ అనుమానిత వ్యక్తులకు సహాయం చేసే సమయంలో వేడిని తట్టుకునే పొట్లాల్లో ఆహారం నింపి అందిస్తున్నారు. మరికొందరు యాప్ ఆధారిత చెల్లింపులతో డబ్బులు తీసుకుని సహకరిస్తున్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'