హైదరాబాద్ నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, తదితర ప్రాంతాల్లో.. పచ్చదనం, ప్రకృతి అందాలు వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోడ్లకు ఇరువైపులా వేసిన విభిన్న రకాల మొక్కలు, వాటి పువ్వులు.. అటుగా వెళ్లే వారిని కట్టిపడేస్తున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో వాటి అందం మరింత రెట్టింపవుతోంది. సెలవులు, పండుగలు వస్తే.. నగరవాసులు వెంటనే నెక్లెస్‌రోడ్‌లో వాలిపోతారు. ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు.
సాయంత్రం సమయాల్లో ఈ ప్రాంతాలు సందడిగా మారిపోతాయి. ఓ వైపు ప్రకృతి అందాలు, మరోవైపు చిన్నారులు ఆటపాటలతో ఆ ప్రాంతం కనులపండువగా మారుతోంది. వారాంతం సమయాల్లో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది.
ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల సందర్శనకు వెళ్తుంటారు. అలాంటి ప్రకృతి ప్రేమికులకు నెక్లెస్‌రోడ్, సాగర్ పరిసర ప్రాంతాలు ఆ లోటును తీరుస్తున్నాయి. చక్కటి ఆహ్లాదంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తున్నాయి.