NCP Vice President Ghanshyam Shelar join BRS : చిత్తశుద్ధి లేని సంప్రదాయ పార్టీల ప్రణాళికలు.. మూస పరిపాలన విధానాలు ఉన్నంత వరకూ దేశ అభివృద్ధి కుంటుపడుతుందని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన ఎన్సీపీ ఉపాధ్యక్షుడు ఘనశ్యామ్ షెలార్ సహా పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాకెట్ సైన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలనే తపన పాలకులకు ఉంటే చాలన్నారు. ప్రజలకోసం సృజనాత్మకంగా పనిచేసే ఆలోచన విధానాలు ఏడు దశాబ్దాలుగా పాలకులకు లేకపోవడం దేశ ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు.
ఏ దేశానికి లేనన్ని సహజ వనరులు ఉన్నప్పటికీ.. ప్రజలు నీరు, విద్యుత్ వంటి కనీస అవసరాల కోసం తపిస్తుండటం శోచనీయమన్నారు. రైతులు, దళిత, ఆదివాసీ, బలహీన వర్గాలు కేంద్రంగా ప్రభుత్వాలు పాలనా ప్రాధమ్యాలను ఖరారు చేసుకోవాలని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అలా చేసుకున్నందుకే దేశానికే రోల్ మోడల్ అయిందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసుకున్న తీరుగా దేశంలో పాలన జరగడం లేదన్నారు. మూస ధోరణులు, అధికారులపై ఆధారపడి కాలం ఎల్లదీయడం తప్ప..ప్రజా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే మనసే లేదన్నారు.
మనసుంటే మార్గం ఉంటుందనే విషయాన్ని తొమ్మిదేళ్ల తెలంగాణ నిరూపించిందని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి దిశగా భారత దేశంలో సమూల మార్పును తీసుకువచ్చేందుకు పుట్టిన పార్టీ అని.. అందుకు ముందడుగు మహారాష్ట్ర నుంచి పడుతున్నందుకు సంతోషంగా వుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా రైతులు మహిళలు యువత చైతన్యమై కలసికట్టుగా నిలబడి పార్టీలను కాకుండా ప్రజా ఆంకాంక్షలను గెలిపించుకునేందుకు కృషి కొనసాగించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భారత్ పరివర్తనతోనే దేశంలోని రైతులు, దళితులు, బహుజన, ఆదివాసీలు సహా ప్రజలందరి కష్టాలు తొలగిపోతాయన్నారు. పరివర్తన తీసుకువచ్చే ఆలోచన కేంద్రంలోని పాలకులకు లేదన్నారు.
BRS party office in maharastra : పార్టీ తొలి కార్యాలయాన్ని నాగపూర్‌లో ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. అందులో భాగంగా రేపు కేసీఆర్ నాగ్‌పూర్ వెళ్లి.. పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ముచ్చటించి.. వారిలో జోష్ నింపనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే మొదటగా దిల్లీలో శాశ్వత కార్యాలయం ప్రారంభించగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ.. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో ప్రారంభించనున్నారు.
ఇవీ చదవండి: