నౌకాదళాల విజయాలు, దేశ రక్షణలో అమరులైనవారి పాత్రను గుర్తుచేసుకునేందుకు.. ఏటా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వారి సేవలను స్మరించుకొని.. నివాళులు అర్పిస్తారు. దేశ రక్షణ, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే నౌకాదళానికి.. సుదీర్ఘ చరిత్ర ఉంది. 1600వ సంవత్సరంలో నౌకాయానం ద్వారా దేశంలో వాణిజ్య కార్యకలాపాలు మొదలవగా, రక్షణ పరంగానూ నౌకల ప్రాధాన్యం పెరిగింది. బ్రిటిష్ పాలనలో.. నౌకాదళాన్ని 'ఇండియన్ రాయల్ నేవీ'గా పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చాక.. 1950లో 'ఇండియన్ నేవీ'గా మార్చారు.
నౌకదళం పాత్ర తిరుగులేనిది..
భారత ద్వీపకల్పానికి... త్రివిధ దళాల్లో నౌకాదళం పాత్ర తిరుగులేనిది. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో.. ఆ దేశ అతిపెద్ద నౌకాశ్రయమైన కరాచీ పోర్టుపై, డిసెంబర్ 4న భారత నౌకాదళం మెరుపుదాడి చేసింది. మూడు పాకిస్థాన్ యుద్ధనౌకలను ముంచి వేసింది. జలాంతర్గామి, యుద్ధనౌకలతో... ముప్పేట దాడి చేసింది. ఆ ఘటనలో 200 మందికి పైగా పాకిస్థాన్ నావికులు, సైనికులు మరణించారు. భారత నౌకాదళం చేపట్టిన ఈ 'ఆపరేషన్ ట్రైడెంట్' విజయానికి ప్రతీకగానే... ఏటా డిసెంబర్ 4 న భారత నావికాదళ దినోత్సవం జరుపుతారు.
ప్రపంచంలో అతిపెద్ద నౌకాదళాల్లో... మన దేశానికి కీలక స్థానముంది. ఏటా స్నేహపూరిత దేశాలతో సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ జలాల్లో..... హిందూ మహాసముద్ర పరిధిలో... శాంతియుత వాతావరణానికి విఘాతం కలగకుండా చూస్తోంది. అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి ఆటంకాలు కలగకుండా... గస్తీతో పాటు భరోసా ఇస్తోంది. యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించిన తర్వాత.. విశాఖకు సమీపంలోనే ఘాజీ అనే జలాంతర్గామిని గుర్తించి ముంచేశారు. ఇలాంటి అంశాలు.. సాగరతీరం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం ప్రాభవాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి.
విశాఖ సాగరతీరంలో 'విక్టరీ ఎట్ సీ' పేరుతో ప్రత్యేక స్మారక చిహ్నం సైతం నిర్మించారు. నౌకాదళం దినోత్సవం సందర్భంగా... అమరవీరులకు అంజలి ఘటించి వారి సేవలను గుర్తు చేసుకుంటారు.