Navratri Celebrations In Telangana: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ ఛైర్మన్ పి.విష్ణువర్ధన్ రెడ్డి కుటుబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ సిబ్బంది, అర్చకులకు నూతన వస్త్రాలను అందించారు.
బాసర సరస్వతి అమ్మవారి ఆలయం: నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా తొలిరోజు శైలపుత్ర అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనిమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఓరుగల్లు శ్రీభద్రకాళి అమ్మవారి ఆలయంలో: ఓరుగల్లువాసుల ఇలవేల్పు శ్రీభద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలిరోజు అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకాలను నిర్వహించారు. భద్రకాళీ అమ్మవారి దర్శనానికి ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
వన దుర్గామాత ఆలయంలో: జగిత్యాలలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని పుర విధుల్లో ఊరేగించారు. తహసీల్ చౌరస్తా.. టవర్ సర్కిల్.. కొత్త బస్టాండ్ కూడలి మీదుగా దుర్గాదేవి శోభయాత్ర సాగింది. శోభయాత్ర సందర్భంగా కళాకారుల ప్రదర్శన పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు అమ్మవారి వేషదారణలో ర్యాలీలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్‌పల్లిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయంలో దేవి నవరాత్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
వర్గల్‌లోని విద్యా సరస్వతి ఆలయంలో: తెల్లవారి జామున ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కుంకుమార్చన చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని విద్యా సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు.
హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో: హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో దసరా నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమం ఉంటుందని ప్రధాన అర్చకులు ఉపేంద్ర శర్మ తెలిపారు.
పరాకాల రెవెన్యూ వ్యాప్తంగా దేవీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పరకాల కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలను స్థానిక మున్సిపాలిటీ ఛైర్మన్ సోదా అనిత ప్రారంభించారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.
ఇవీ చదవండి:
ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రులు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు
మైసూర్ ప్యాలెస్‌లో నవరాత్రి ఉత్సవాలు.. ఎక్స్‌క్లూజివ్ ఫొటోస్