శస్త్ర చికిత్సలు తగ్గించి సహజ జననాలు ప్రోత్సహించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి వేణుగోపాలాచారి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా హైటెక్ సిటీలోని ఫోనిక్స్ ఆర్ట్ కల్చరల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో ప్రసవసమయంలో శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు.
తెలంగాణలోనే అధికం
దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఎక్కువ ఆపరేషన్ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. నాగాలాండ్‌లో 5.8 శాతం ఉండగా బిహార్‌లో 6.2 శాతం, పంజాబ్‌లో 24.6, తమిళనాడులో 34.1, కేరళలో 35.8 శాతం శస్త్ర చికిత్స కేసులు నమోదు అవుతుండగా తెలంగాణలో మాత్రం 57.7 శాతం జరుగుతున్నాయని వివరించారు. ఇది మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోందని భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
శస్త్ర చికిత్సలు తగ్గించేందుకు సర్కారు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలన్నారు. సహజ కాన్పు సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలని కోరారు. ఆస్పత్రుల్లో సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ రూడవత్, గీతం ఫౌండేషన్ ఛైర్మన్ రామ్తిలక్, వెల్‌టెక్ ఫౌండేషన్ ఛైర్మన్ చిలుపూరి వీరాచారి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది ర్యాలీ