హైదరాబాద్ బేగంబజార్‌లో నాలాలపై ఆక్రమ నిర్మాణాలు తొలగించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించిన 24 గంటల్లోనే ఉస్మాన్‌గంజ్ నాలాపై ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. సుమారు 70 ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి చొరవ చూపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
నాలా ఆక్రమణ..
బేగంబజార్‌లోని ఉస్మాన్‌గంజ్ నాలా ఆక్రమణకు గురైంది. ఫలితంగా వర్షాకాలంలో నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్పొరేటర్ శంకర్ యాదవ్ స్థానికులతో కలిసి విషయాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు.
పనులు పరీశీలిస్తుండగా...
శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ నాలాపై జరుగుతున్న పనులను పరిశీలించారు. నాలా పనులకు ఓ నిర్మాణం అడ్డంకిగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. తక్షణమే ఆక్రమ నిర్మాణం తొలగించాలని... ఎంతటివారైనా ఉపేక్షించవద్దని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగించింది. అనంతరం సమస్య పరిష్కారానికి మంత్రి నిధులు మంజూరు చేయించారు. ఫలితంగా 2.25 కోట్ల రూపాయల వ్యయంతో నాలాపై స్టీల్ గైడర్లతో వంతెన నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టారు.