Telangana BJP Leaders to Karnataka Election Campaign: కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలను.. జాతీయ నాయకత్వం పంపించనుంది. కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా బాధత్యలు నిర్వర్తిస్తోన్న పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు.. తెలుగు ఓటర్ల బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాల ఓట్లు బీజేపీకి కీలకంగా మారనుండటంతో ఈ బాధ్యతలు ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు రెండు మాసాలే ఉండటంతో ప్రచారం ముమ్మరం: తెలుగు ప్రాబల్యం అధికంగా ఉన్న కలుబుర్గి, యాద్గిర్, బళ్లారి, కొప్పల్, బీదర్‌తో పాటు.. 5 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతను డీకే అరుణకు అధిష్ఠానం అప్పగించింది. కర్ణాటక శాసనసభ ఎన్నికలు మే నెలలో జరగనున్నాయి. ఎన్నికలకు మరో రెండు మాసాలే సమయం ఉండటంతో జాతీయ నాయకత్వం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఒక వైపు జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులతో పాటు తెలంగాణకు చెందిన జాతీయ నాయకులను బీజేపీ ప్రచార బరిలోకి దింపింది.
ప్రత్యేక బృందంతో కర్ణాటకలో పర్యటించనున్న సంజయ్: ఇప్పటికే కర్ణాటకలో మూడు బహిరంగ సభల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రత్యేక బృందంతో కర్ణాటకలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లోనూ తెలంగాణ తరపున పలువురు బీజేపీ నేతలు వెళ్లి ప్రచారం చేశారు. తెలుగు ఓటర్ల కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని గుజరాత్ ఎన్నికల్లో విజయఢంకా మోగించడంలో రాష్ట్ర బీజేపీ నేతలు సత్తా చాటారు.
ఈసారి తెలంగాణలోనూ సత్తా చాటాలి: అదే సీన్‌ను కర్ణాటక ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని కాషాయదళం భావిస్తోంది. బండి సంజయ్ ప్రత్యేక టీమ్‌తో పర్యటిస్తే.. అదే దారిలో మహిళా మోర్చా నేతలు వెళ్లి ప్రచారం చేయనున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారం నిర్వహించేలా అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తోంది. కర్ణాటకను చేజార్చుకోకుండా మళ్లీ అధికారంలోకి వచ్చి.. దక్షిణాదితో పాటు ఈసారి తెలంగాణలోనూ తమ సత్తా చాటాలని కమలనాథులు కంకణం కట్టుకున్నారు. హోరాహోరీగా జరిగే పోరులో కమలదళం కర్ణాటకను నిలుపుకుంటుందా..? లేక చేజార్చుకుంటుందా అనేది వేచి చూడాలి.
ఇవీ చదవండి: