జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన అరిశెనపల్లి జగన్ మోహన్‌రావు విజయం సాధించారు. ఈనెల 18న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవగా అధ్యక్ష పదవికి జగన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో కీడ్రా సంఘానికి అధ్యక్షుడిగా తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక వ్యక్తిగా జగన్ నిలిచారు.
ఒలింపిక్ క్రీడైన హ్యాండ్‌బాల్ కార్యకలాపాల్లో 2018 నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న జగన్ మోహన్‌రావు 2019లో తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. తర్వాత ఆసియా హ్యాండ్ బాల్, ఇంటర్డిస్ట్రిక్ట్ జాతీయ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ వేదికగా నిర్వహించి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు.
హ్యాండ్‌బాల్ జాతీయ అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న 29 రాష్ట్ర సంఘాలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో గ్రామీణ స్థాయి నుంచి హ్యాండ్‌బాల్‌కు మంచి క్రేజ్ ఉందని.. కానీ వాణిజ్యపరంగా పోలిస్తే క్రికెట్, బ్యాడ్మింటన్ కంటే చాలా వెనకపడి ఉందని అన్నారు. అందుకే ఉన్నత స్థితికి చేర్చేందుకు హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్‌కు శ్రీకారం చుట్టానని వెల్లడించారు.
ఇండోర్ గేమ్ అయిన హ్యాండ్‌బాల్.. మౌలికవసతుల వెనుకబాటుతో అవుట్‌డోర్ గేమ్‌లా మారిపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్ సంఘం, సాయ్ సహకారంతో మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తానని తెలిపారు. ఒలింపిక్స్‌లో మెడల్ లక్ష్యంగా భారత క్రీడాకారులను తయారు చేయడమే తన ఆశయమని అన్నారు.
ఇదీ చదవండి: వాసాలమర్రిని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి